
థీంపార్కులో శ్రీవారి ఆలయం
రాజంపేట : అదివో..అల్లదివో..శ్రీహరివాసము..బ్రహ్మకడిగిన పాదము..అంటూ సులువైన పదాలతో కీర్తనలు అలపించిన అన్నమయ్య జన్మస్థలి అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. అన్నమాచార్యుని 600 జయంత్యుత్సవాలను అప్పటి టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హయాంలో నభూతో అన్న రీతిలో జరిగాయి. 108 అన్నమయ్య అడుగుల విగ్రహావిష్కరణకు విచ్చేసిన దివంగత సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అన్నమయ్య జన్మస్థలి అభివృద్ధికి సంబంధించి హామీలను ప్రకటించారు.
మహానేత మరణం తర్వాత అన్నమయ్య జన్మస్థలిలో ఉన్న అన్నమయ్య థీంపార్కు(108 అడుగుల అన్నమయ్య విగ్రహ ప్రాంతం) అభివృద్ధి ఆటకెక్కించేశారు నాటి పాలకులు.దీని గురించి పట్టించుకునేవారుకరువయ్యారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అన్నమయ్య జన్మస్థలి గురించి మరిచిపోయాయి. అప్పటి టీటీడీ పాలకమండలి తాళ్లపాక, అన్నమయ్య థీంపార్కు అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపు ఊసెత్తలేదు. సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి, ఇప్పుటి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హయాంలో మళ్లీ అన్నమయ్య జన్మస్థలి అభివృద్ధిపై దృష్టి సారించారు.
అన్నమయ్య ఉద్యానవనంలో 14ఏళ్ల తర్వాత మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి బీజం పడింది. అప్పట్లో ఎంపిక చేసిన స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించారు. టీటీడీ రూ.కోటికిపైగా వ్యయం చేస్తోంది. ఈ మార్గంలో తిరుమలకు వెళ్లే దక్షిణభారత యాత్రీకులు ముందుగానే అన్నమయ్య జన్మస్థలిలో శ్రీవారిని దర్శించుకోవడం మహానందగా భావిస్తున్నారు. తాళ్లపాక, 108 అడుగుల విగ్రహం ప్రాంతం పార్కును టీటీడీ అటవీశాఖ సిద్ధం చేసింది. ఆలయం నిర్మాణం పూర్తికావడంతో త్వరలో ప్రారంభించడానికి టీటీడీ సన్నద్ధమవుతోంది.