
28న ఐదువేల మందితో యోగా నిర్వహించాలి
రాయచోటి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర–2025లో భాగంగా ఈనెల 28న ఒకే ప్రాంతంలో ఐదువేల మందితో యోగా కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణ తదితర అంశాల్లో చేపట్టాల్సిన పనులపై దిశా నిర్దేశం చేశారు. జిల్లా నుంచి పది లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
● జిల్లాలోని 500 గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో ప్రతిరోజూ చెత్త సేకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో తడి, పొడి చెత్తలను విడిగా సేకరించాలని, ఈ దశగా ప్రజలలో అవగాహన పెంపొందించాలన్నారు. జిల్లాలోని అన్ని బస్టాండ్‌లలో మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. బస్టాండ్ పరిసరాలలో క్రమం తప్పకుండా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ బాగుండాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్‌రావు, సబ్ కలెక్టర్ వైఖోన్ నదియా దేవి, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్