
ఇక రుణాలన్నీ ఆన్‌ౖలైన్‌లో మంజూరు
బి.కొత్తకోట: మహిళా సంఘాలకు మంజూరు చేసే రుణాలన్నీ ఇకపై డిజిటల్ విధానంలో ఉంటాయని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో సంఘమిత్రలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి రుణాల మంజూరుకు సంబంధించి వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. మొదట సీసీ లాగిన్‌లో రుణానికి సంబంధించిన వివరాలు నమోదు చేశాక ఏపీఎం లాగిన్‌కు.. అక్కడినుంచి బ్యాంక్ మేనేజర్ లాగిన్‌కు వెళుతుందన్నారు. బ్యాంకు మేనేజర్లు వీటిని పరిశీలించి ఎవరికి ఎంత రుణం మంజూరు చేయాలి అన్నది నిర్ణయిస్తారన్నారు. ఇకపై సంఘమిత్రలు, సభ్యులు బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.వార్షిక జీవనోపాదులు, రుణ ప్రణాళిక మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటుందని చెప్పారు. ఏసీ గంగాధర్, ఏపీఎం రాజేశ్వరీ, సీసీలు,సంఘమిత్రలు పాల్గొన్నారు.
3 నెలల్లో లక్ష్యం సాధించాలి
కలికిరి: ఉపాధి సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యం మేరకు కూలీలకు పని దినాలు కల్పించాలని ఉపాధి హామీ పీడీ వెంకటరత్నం అన్నారు. గురువారం స్థానిక సీఎల్‌ఆర్‌సీ కార్యాలయంలో కలికిరి క్లస్టర్ పరిధిలోని సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీల లక్ష్యం మూడు నెలల్లో సాధించాలని, ఫాంపాండ్‌ల లక్ష్యాలను జూన్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో హార్టికల్చర్ ప్రోగ్రాంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టి, ప్రతి రైతు ఉద్యాన పంటల సాగు చేపట్టేలా చూడాలన్నారు.
ఉపాధి కల్పనలో
శ్రద్ధ చూపండి
మదనపల్లె: ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించే విషయంలో శ్రద్ధ చూపాలని డ్వామా పీడీ వెంకటరత్నం అధికారులను సూచించారు. గురువారం ఆయన మదనపల్లె రూరల్ మండలంలోని వలసపల్లె పంచాయతీలో జరుగుతున్న ఫాంపాండ్ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. కూలీ ఎంత వస్తుంది, ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫాంపాండ్ పనులు నాణ్యత ఉండేలా చూడాలన్నారు. కూలీలకు పనులు కల్పించడమే కాకుండా వాటి ద్వారా ప్రయోజనం కలగాలని కోరారు. ఇచ్చిన పనుల లక్ష్యాలను సత్వరమే పూర్తి చేసేలా క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఎంపీడీఓ తాజ్‌మస్రూర్, ఏపీఓ చెన్నకేశవులు, సిబ్బంది పాల్గొన్నారు.