
పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు
నిలువరించాలని డీజీపీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ వినతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారి పోలీసులే చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్న తీరుపై తక్షణం స్పందించి, నిలువరించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది. నాలుగు రోజులుగా డీజీపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆదివారం వైఎస్సార్‌సీపీ నేతలు నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది ఎల్ చిరంజీవులు, తదితరులు అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. వైఎస్సార్‌సీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు వాగ్వాదానికి దిగారు.
అనంతరం డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందచేశారు. దేశంలో ఎక్కడా చూడని విధంగా రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి లొంగిపోయి, చట్టాలనే అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీ ఇప్పటికైనా స్పందించాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, టీజేఆర్ సుధాకర్‌బాబు, మేయర్ భాగ్యలక్షి, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యానికే తలవంపులు
‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉంది. అధికార టీడీపీకి అనుకూలంగా వారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అనే సందేహం కలుగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ కూటమి పార్టీలతో కాదు.. పోలీసులతోనే అన్నట్లుంది. పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటారు.. దాడులపై ప్రేక్షక పాత్ర వహిస్తారు. బాధితులైన మా పార్టీ శ్రేణులపైనే తప్పుడు కేసులు బనాయిస్తారు.
బైండోవర్ పేరుతో ప్రతిరోజూ స్టేషన్లో గంటల తరబడి నిర్బంధిస్తారు. దాడులకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులకే రక్షణ కల్పిస్తుంటారు. ఇదీ పరిస్థితి. డీజీపీ ఉన్నది చట్టాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి. పోలీస్ విభాగం అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తల్లా పనిచేస్తుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు? ప్రతిపక్షంగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తుంటే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఎవరి ఒత్తిడితో కనీసం స్వేచ్ఛగా వినతిపత్రం కూడా తీసుకోలేని నిస్పహాయ స్థితిలో ఉన్నారు? పులివెందులలో పోలీసులు ఖాకీ యూనిఫారం తీసేసి, పచ్చచొక్కాలతో పని చేస్తున్నారు. ఒక చిన్న ఎన్నికను పెద్ద యుద్ధంగా మార్చేస్తున్నారు. ఏకంగా ఒక ఎమ్మెల్సీపైనే హత్యాయత్నం చేశారంటే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం అవుతోంది.
ఇప్పటికైనా డీజీపీ కళ్లు తెరవాలి
పులివెందుల అంటే డాక్టర్ వైఎస్సార్ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్న ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఉప ఎన్నికలో స్థానికంగా ఉన్న వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను, కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేసేందుకు తెగబడటం దారుణం. ఇందుకు పోలీసులు సహకరించడం బాధాకరం. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై హత్యాయత్నం ఘటనలో దోషులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వద్దకు వెళితే పట్టించుకోలేదు.
కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిస్తే.. ‘పత్తి యాపారం కోసం ఆ గ్రామానికి వెళ్లారా.. మేం ఉండబట్టే తలలు పగిలాయి.. లేకపోతే తలలు తెగిపోయేవే’ అంటూ హేళనగా మాట్లాడారు. బాధితులైన మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం ఈ ప్రభుత్వ అరాచకానికి, పోలీస్ వ్యవస్థ దిగజారుడుతనానికి పరాకాష్టగా కనిపిస్తోంది. మొత్తంగా పోలీసులను అడ్డుపెట్టుకుని ఏకపక్షంగా ఓట్లు వేయించుకునే కుట్ర జరుగుతోంది. ఇప్పటికైనా డీజీపీ కళ్లు తెరవాలి’ అని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.