బందరుకే కాదు.. ఏపీకే కమల్‌హాసన్‌ కొల్లు రవీంద్ర: పేర్ని నాని | YSRCP Perni Nani Satirical Comments On Kollu Ravindra | Sakshi
Sakshi News home page

బందరుకే కాదు.. ఏపీకే కమల్‌హాసన్‌ కొల్లు రవీంద్ర: పేర్ని నాని

Oct 10 2026 1:35 PM | Updated on Oct 10 2026 2:27 PM

YSRCP Perni Nani Satirical Comments On Kollu Ravindra

సాక్షి, కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి, వైఎ‍స్సార్‌సీపీ పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనుల విషయంలో మంత్రి వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. హార్బర్‌ పనులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో తెలియకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కొల్లు రవీంద్ర బందరుకే కాదు.. ఆంధ్రప్రదేశ్‌కే పెద్ద కమల్‌హాసన్‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌ పనులు 2014–19 మధ్యలోనే టెండర్లు ఖరారయ్యాయని  కొల్లు రవీంద్ర చెబుతున్నారు. వాస్తవానికి 2020లోనే రూ.422 కోట్లతో హార్బర్‌ నిర్మాణ పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.244.8 కోట్లను నాబార్డు ద్వారా సమకూర్చుకుందని, 2020 అక్టోబర్‌లో పర్యావరణ అనుమతులు వచ్చాయని వివరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలుత నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించారని, అనంతరం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మరో ఆరు హార్బర్లను తీసుకొచ్చారని పేర్ని నాని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌ పనులు 60 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు.

2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2026 వరకు హార్బర్‌ పనులపై ఎందుకు దృష్టి పెట్టలేదని కొల్లు రవీంద్రను ప్రశ్నించారు. గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్ట్‌ సంస్థకే 2026 జూలైలో గడువు పొడిగించారని, ఇప్పుడు మంత్రి హార్బర్‌ వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. హార్బర్‌ పనులను పర్యవేక్షించాల్సింది జిల్లా కలెక్టరా, ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ బోర్డా అని ప్రశ్నించారు. సంబంధిత మారిటైమ్‌ బోర్డుతో మంత్రి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

గిలకలదిండి హార్బర్‌లో టీడీపీ కార్యకర్త సలీమ్‌ను సూపర్‌వైజర్‌గా నియమించారని, మరో ఇద్దరు కార్యకర్తలకు రెండు బోట్లు ఏర్పాటు చేయించారని పేర్ని నాని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా పనులు ఎలా జరుగుతున్నాయో మంత్రికి వారు చెప్పలేదా అని ప్రశ్నించారు. బందరు ప్రాంతానికి తాను చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పగలనని, కొల్లు రవీంద్ర ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని సవాల్‌ విసిరారు.

గిలకలదిండిలో 22 బెల్టు షాపులు ఉన్నాయని పేర్కొన్న పేర్ని నాని.. వాటిపై సమీక్ష నిర్వహించడానికి సమయం దొరుకుతున్న మంత్రికి ఫిషింగ్‌ హార్బర్‌, మత్స్యకారుల సమస్యలపై సమీక్షించడానికి ఎందుకు సమయం దొరకడం లేదని ప్రశ్నించారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నారా అని నిలదీశారు. హార్బర్‌ పనుల కాంట్రాక్టర్‌ను బెదిరించి, మున్సిపల్‌ ఎన్నికల ఖర్చుల కోసం నిధులు సమకూర్చుకోవడానికి మంత్రి అక్కడికి వచ్చారనే చర్చ గిలకలదిండిలో జరుగుతోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: జైల్లో పెట్టినా నా పోరాటం ఆపను: ఎమ్మెల్యే విరూపాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement