విద్యా వ్యవస్థలోను స్కామ్‌లు చేసే దౌర్భగ్య స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం
డీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ రావడమేంటి?
వైఎస్సార్‌సీపీ నేతలు పేర్ని, మేరుగు, ఆదిమూలపు, జక్కంపూడి ఫైర్
సాక్షి, అమరావతి/ఒంగోలు సిటీ/కోరుకొండ : డీఎస్సీ నియామకాల్లోను స్కామ్‌లకు పాల్పడిన ప్రభుత్వ బరితెగింపు అత్యంత దుర్మార్గమని మాజీమంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజానికి భావిపౌరుల్ని అందించాల్సిన విద్యా వ్యవస్థలో సైతం స్కాంలు చేసే దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. వీరు సోమవారం వేర్వేరు చోట్ల డీఎస్సీ అక్రమాలపై స్పందిస్తూ ఏమన్నారంటే..
ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా?..
డీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగికి స్టేట్‌ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చింది? ఈ చోద్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. మెరిట్ లిస్ట్ ప్రకటించమని హైకోర్టు చెప్పినా పట్టించుకోలేదు. ఇంతకన్నా బరితెగింపు ఏమైనా ఉంటుందా? కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన చంద్రబాబు, ఆయన కుమారుడికి మాత్రమే పైలా పచ్చిస్‌లా సాగింది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ వాళ్లది తడిగుడ్డల పార్టీ. ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం గోడ కూల్చివేత సమయంలో స్పందించిన పవన్‌కళ్యాణ్ కార్ టాప్‌పై ఎక్కి మరీ వచ్చారు.. ఇప్పుడు బందరులో కార్యకర్త ఇంటి కూల్చివేత విషయంలో ఎందుకు స్పందించడం లేదు? – పేర్ని నాని, మాజీమంత్రి
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి..
చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. నిరుద్యోగులను చంద్రబాబు, లోకేశ్ దగా చేశారు. అది మెగా డీఎస్సీ కాదు. మెగా స్కామ్. డీఎస్సీ ప్రక్రియను ప్రభుత్వ పెద్దల గుప్పెట్లో ఎందుకు పెట్టుకున్నారు? జిల్లా సెలక్షన్ కమిటీలను ఎందుకు నిర్వీర్యం చేశారు? టెట్ నిబంధనలను ఎందుకు మార్చేశారు? ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. – మేరుగు నాగార్జున, మాజీమంత్రి
లోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు..
చంద్రబాబు సర్కారు నిర్వహించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఎంపికల వరకు భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి. అది మెగా డీఎస్సీ కాదు.. పూర్తిగా మాయా డీఎస్సీ. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ పూర్తిగా విఫలమయ్యారు. విద్యాశాఖను ఆయన పూర్తిగా గాలికి వదిలేసి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రభుత్వం చెప్పడంలేదు. లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. – ఆదిమూలపు సురేష్, మాజీమంత్రి
సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలి..
సీఎం చంద్రబాబు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో అవినీతి అడ్డూ, అదుపులేకుండా సాగుతోంది. డీఎస్సీ నిర్వహించిన వ్యక్తే టాపర్‌గా నిలవడం, ముందుగా పేపర్ లీక్ అవడం భారీస్కామ్ జరిగిందనడానికి బలం చేకూరింది. టాపర్‌గా నిలిచిన వ్యక్తికి పోస్టు ఇవ్వకపోవడం.. అక్రమాల ఆనవాళ్లు లేకుండా ఆన్‌లైన్ డేటాను డిలీట్ చేయడం, మెరిట్‌లిస్టును ప్రకటించకుండా, ఎంపికైన అభ్యర్థులకు మెస్సేజ్‌లివ్వడం సిగ్గుచేటు. ఈ స్కామ్‌పై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. – జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు


