అర్హుల ఓట్లు ఒక్కటి తీసినా ఒప్పుకోం | YSRCP Perni Nani About Special Electoral Roll Revision | Sakshi
Sakshi News home page

అర్హుల ఓట్లు ఒక్కటి తీసినా ఒప్పుకోం

May 27 2026 5:43 AM | Updated on May 27 2026 5:43 AM

YSRCP Perni Nani About Special Electoral Roll Revision

‘సర్‌’ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని 

ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఓటర్ల ఎత్తివేత చేపట్టటానికి వీల్లేదు 

పార్టీలు ఇచ్చిన బీఎల్‌ఏ జాబితాను అధికారికంగా ఆథరైజ్‌ చేయాలి 

ఉమ్మడి రాష్ట్ర ఓటర్ల జాబితాలను సరిపోల్చుకోవాలి 

డూప్లికేట్‌ లేదా డబుల్‌ ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఈసీదే  

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరుతో రాష్ట్రంలో అర్హులైన ఓటర్లను ఒక్కరిని తగ్గించినా ఒప్పుకునేది లేదని వైఎస్సార్‌ సీపీ తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని.. రాజకీయ పార్టీలు ఇప్పటికే సమర్పించిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ) జాబితాను అధికారికంగా ఆథరైజ్‌ చేయాలని స్పష్టం చేసింది.

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి మంగళవారం వెలగపూడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో సమావేశం అనంతరం వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ఎత్తివేత కార్యక్రమం చేపట్టటానికి వీల్లేదన్నారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటును కూడా తొలగించవద్దని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వివేక్‌ యాదవ్‌ను కోరినట్లు పేర్ని నాని  తెలిపారు.  

పార్టీల సమక్షంలోనే ‘సర్‌’ ప్రక్రియ జరపాలి
ఉత్తర భారత దేశం పలు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌–సర్‌) పేరు మీద చాలా విచిత్రాలు జరిగాయి. దీనివల్ల అనేకమంది అర్హులైన ఓటర్లకి ఓటు లేకుండా పోయిందని వార్తల్లోనూ, టీవీల్లోనూ చూస్తున్నాం. మన రాష్ట్రంలో అలా కాకుండా ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలి. రాజకీయ పార్టీలు ఇప్పటికే సమర్పించిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ) జాబితాను అధికారికంగా ఆథరైజ్‌ చేయాలి. బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌(బీఎల్‌ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేసేటప్పుడు, ఖచ్చితంగా రాజకీయ పార్టీల ప్రతినిధులైన బీఎల్‌ఏలను కూడా తమ వెంట పెట్టుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.

18 ఏళ్లు నిండిన, అర్హులైన  ఏ ఒక్క ఓటరుకు కూడా రాష్ట్రంలో ఓటు లేకుండా పోకూడదు. 2002లో చివరిసారిగా ఇటువంటి ‘సర్‌’ జరిగింది కాబట్టి దానిని ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. అందువల్ల 2002 నాటి ఓటర్ల ముసాయిదాను కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరాం. అలాగే 2025 జనవరి 25 తర్వాత పబ్లిష్‌ అయిన సప్లిమెంటరీ ఓటర్‌ లిస్ట్‌లు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు. కాబట్టి 2025 జనవరి నుంచి ఈ నెల 25 వరకు నమోదైన ప్రతి ఓటరు లిస్టును రాజకీయ పార్టీలకు అందించాలి.

2002లో ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉంది కాబట్టి ఇక్కడి పౌరులలో చాలామందికి అప్పట్లో తెలంగాణలో ఓటు ఉండే అవకాశం ఉంది. అందువల్ల బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లినప్పుడు వారి ఫోన్లలో ఉండే యాప్‌లో 2002 ఓటర్‌ లిస్ట్‌కు సంబంధించిన డేటా (తెలంగాణ లేదా భారతదేశంలో ఎక్కడ ఓటు ఉన్నా సరే) చూసుకునే వీలుండాలి. యాప్‌లో ఆ సదుపాయం ఖచ్చితంగా కల్పించాలని మేం కోరగా అందిస్తామని సీఈఓ చెప్పారు. ఓటర్లు ఇంట్లో అందుబాటులో లేకపోతే, విదేశాల్లో ఉంటే ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఫారమ్‌ను పూర్తి చేసి సమర్పించే అవకాశాన్ని కల్పించాలి.

డూప్లికేట్‌ ఓట్లు లేదా డబుల్‌ ఓట్లు (ఒకే మనిíÙకి రెండు లేదా మూడు ఊర్లలో, ఒకే నగరంలో రెండు డివిజన్లలో, లేదా రెండు రాష్ట్రాలలో ఓట్లు) లేకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘానిదే అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. డబుల్‌ ఓటు అనేది లేకుండా ఉండేలా ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ‘సర్‌’ ప్రక్రియపై అనేక రాష్ట్రాల్లో అల్లర్లు, రచ్చ జరిగిందని,  అనేక సందేహాలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇక్కడ అలాంటిదేమీ జరగకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలన్నింటి సమక్షంలోనే ప్రక్రియ జరపాలని కోరాం. అత్యంత పారదర్శకంగా ఈ డ్రైవ్‌ నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. –పేర్ని నాని, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి

రాష్ట్రంలో అలా జరగకూడదు.. 
ఇటీవల దేశవ్యాప్తంగా ‘సర్‌’ ప్రక్రియపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. మన దేశ పౌరులై ఉండి గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న లక్షలాది మంది ఓట్లను బెంగాల్, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో తొలగించారు. మన రాష్ట్రంలో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా, ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా నిజాయితీగా జరగాలని కోరాం. పేదలు, దళితులు రోజువారీ కూలీ పనుల కోసం ఉదయమే వెళ్తారు.

కాబట్టి ఉదయం 7 నుంచి 10 గంటల లోపు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ పూర్తి చేయాలని సూచించాం. గతంలో హైదరాబాద్‌ లేదా తెలంగాణలో ఓటు ఉండి, ఇప్పుడు ఇక్కడి ఓటర్‌ లిస్ట్‌లో పేరు లేని వారు ఓటు హక్కును కోల్పోకూడదు. అందుకోసం నాటి ఓటర్ల లిస్ట్‌లను కూడా ఇక్కడి అధికారులకు అందుబాటులో ఉంచాలని కోరాం. ఇంటికి వచ్చినప్పుడు వెబ్‌సై ట్‌ ఓపెన్‌ చేసి ఆన్‌లైన్‌లో 2002 తెలంగాణ ఓటర్‌ లిస్ట్‌ కూడా చూసే వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు. –వై.వెంకటేశ్వరరావు, సీపీఎం కార్యవర్గ సభ్యుడు

రాజకీయ ఉద్దేశాలతోనే విమర్శలు 
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ‘సర్‌’ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఇదేదో ఇప్పుడు కొత్తగా జరుగుతున్న విషయం కాదు. దేశంలో చొరబాటుదారులను గుర్తించడంలో, చనిపోయిన వారి వివరాలను తొలగించడంలో, అలాగే అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడంలో ఎన్నికల కమిషన్‌ అత్యంత పారదర్శక విధానంతో వ్యవహరిస్తోంది. ఇటీవల మిగతా రాష్ట్రాలలో ఎన్నికలను గమనిస్తే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్‌ శాతం భారీగా పెరగడానికి ఈ శుద్ధి ప్రక్రియే ప్రధాన కారణం. కొన్ని పార్టీలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో, బురదజల్లేందుకే ఈ ప్రక్రియపై విమర్శలు చేస్తున్నాయి. –నాగోతు రమేష్‌ నాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement