‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి | YSRCP Panchayat Raj demand on MGNREGS workers payment | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి

Apr 28 2026 6:12 AM | Updated on Apr 28 2026 6:12 AM

 YSRCP Panchayat Raj demand on MGNREGS workers payment

విజయవాడలో జేసీకి వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం ఆందోళనలు  

ఈ నిధులన్నింటినీ టీడీపీ కూటమి నేతలు పందికొక్కుల్లా దోచుకోవాలని చూస్తున్నారు 

కూలీలకు వేతనాలు ఇచ్చేవరకూ పోరాడుతాం 

వైఎస్సార్‌సీపీ నేతలు వెన్నపూస రవీంద్రరెడ్డి, దేవినేని అవినాష్‌

సాక్షి, అమరావతి/గాం«దీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కూలీలకు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం డిమాండ్‌ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యపై సోమవారం ఆందోళన చేసింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నాయకులు అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద శాంతియుతంగా ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం.. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు.

ఉపాధి హామీ బకాయిలు విడుదల చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పెమ్మసాని.. ఆ డబ్బును రాష్ట్రంలోని ఒక్క ఉపాధి కూలీ ఖాతాలోకైనా జమచేశారా అని ప్రశ్నించారు. చంద్ర­బాబు ప్రభుత్వం ‘ఉపాధి హామీ’ని నిర్వీర్యం చెయ్యొద్దు.. కూలీల కడుపు కొట్టొదు.. అంటూ పెద్దఎత్తున నేతలు నినాదాలు చేశారు. విజయవాడ కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఆందోళనలో వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏమన్నారంటే..  

పేదల శాపం తగులుతుంది 
‘ఉపాధి హామీ పథకం నిధులన్నింటినీ టీడీపీ కూటమి నేతలు పందికొక్కుల్లా దోచుకోవడానికి చూస్తున్నారు. పేదల శాపం చంద్రబాబు ప్రభుత్వానికి తప్పక కొడుతుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2020–2021 కరోనా సమయంలో కూడా 47.52 లక్షల కుటుంబాలకు 21,85,84,000 పనిదినాలు కల్పించారు. 2021–22లో 24.14 కోట్ల పనిదినాలు, 2023–24లో 25.54 కోట్ల పనిదినాలు కల్పించారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2025–26లో 42.85 లక్షల కుటుంబాలకు కేవలం 18.59 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించారు. 

మరోవైపు.. రెక్కాడితేగానీ డొక్కాడని ఉపాధి కూలీలకు చంద్రబాబు ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి వేతనాలు పెండింగ్‌ పెట్టింది. పనిచేసిన 15 రోజుల్లోపు కూలీలకు వేతనాలివ్వాలని చట్టం స్పష్టంగా చెబుతున్నప్పటికీ దానిని తుంగలో తొక్కారు. ఇలా రూ.1,800 కోట్లు బకాయిలు పెట్టింది. అయితే, పచ్చ మీడియా రూ.1,800 కోట్లు విడుదలయ్యాయని వార్తలు ప్రచురిస్తోంది. నిధులు విడుదలైతే దద్దమ్మ ప్రభుత్వం వేతనాలు ఎందుకు చెల్లించలేదు? గతేడాది డిసెంబరు నుంచి పెండింగ్‌లో ఉన్న కూలీల వేతనాలు విడుదల చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నేతలు వేములకొండ తిరుపతిరావు, కొమ్మినేని రవిశంకర్, ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement