
సాక్షి, ఢిల్లీ: కురుపాం గిరిజన విద్యార్థుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అడుగు వేసింది. సోమవారం ఆ పార్టీ ప్రతినిధుల బృందం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది. చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదు చేసింది.
ఏపీ కురుపాం గిరిజన హాస్టల్స్‌లో భారీ సంఖ్యలో విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడడం తెలిసిందే. అయితే వాళ్లకు సకాలంలో చికిత్స అందకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహంతో ఉంది. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత నీరు, మంచి భోజనం అందించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిరయాదు చేసింది. పెద్ద సంఖ్యలో పిల్లలు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడిన వైనాన్ని హక్కుల సంఘానికి వివరించింది.

గిరిజన హాస్టల్స్ లో చంద్రబాబు సర్కార్ బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం, ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వహించడంపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గిరిజన విద్యార్థుల హక్కులను కాపాడాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపింది. వైఎస్సార్సీపీ బృందంలో ఎంపీలు గురుమూర్తి, తనుజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర తదితరులు ఉన్నారు.