తీరంలో రణన్నినాదం 'పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం' | YSRCP Leaders Fires On Chandrababu Govt At Naupada Public Meeting | Sakshi
Sakshi News home page

తీరంలో రణన్నినాదం 'పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం'

Mar 31 2026 5:00 AM | Updated on Mar 31 2026 5:00 AM

YSRCP Leaders Fires On Chandrababu Govt At Naupada Public Meeting

శ్రీకాకుళం జిల్లా నౌపడలో జరిగిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

నౌపడలో కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణుల ప్రతిన

‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ విజయవంతం 

పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

పోర్టుకు వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు 

ఆంక్షలను దాటుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నేతలు 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే 70 శాతం పనుల పూర్తి 

రెండేళ్లవుతున్నా ప్రాజెక్టును పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం 

పనులు చేయకపోయినా క్రెడిట్‌ చోరీకి బాబు తహతహ 

నౌపడ బహిరంగ సభలో తూర్పారబట్టిన వైఎస్సార్‌సీపీ నాయకులు  

సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)/­టెక్కలి/ సంతబొమ్మాళి/­నందిగాం/ టెక్కలిరూరల్‌: ఉత్తరాంధ్ర తీరంలో అభివృద్ధికి అత్యంత కీలకమైన మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ రణభేరి మోగించింది. రెండేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని ప్రభుత్వ అసమర్థతను తూర్పారపట్టింది. చేసిందేమీ లేకపోయినా పోర్టు ఘనత తమదే అంటూ క్రెడిట్‌ చోరీకి యత్నిస్తున్న చంద్రబాబు కుయుక్తులను కడిగిపారేసింది. శ్రీకాకుళం జిల్లా నౌపడలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి స్థానిక ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. 

ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా జనం రాకను ఆపలేకపోయారు. పోర్టు పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. నౌపడ జంక్షన్‌ వద్ద ముళ్లకంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్‌ చేశారు. చుట్టు పక్కల గ్రామాల వద్ద ఎక్కడిక్కడ టిప్పర్లను అడ్డం పెట్టారు. గ్రామాల శివార్లలో బారికేడ్లు పెట్టారు. ఆధార్‌ కార్డు చూపిస్తేనే గ్రామాల్లోకి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వాటిన్నింటినీ ఛేదించుకుని సభకు అశేషంగా హాజరయ్యారు. మూలపేట పోర్టు విషయంలో అధికార పార్టీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని నేతలు తిప్పి కొట్టారు. ఈ పోర్టు పూర్తయ్యేంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

జగన్‌ హయాంలోనే 70 శాతం పూర్తి 
మూలపేట పోర్టు పనులలో మెజారిటీ భాగం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4,362 కోట్ల నిధులను సమకూర్చారు. ఫైనాన్షియల్‌ క్లోజర్‌ జరిగింది. రుణాలకు బ్యాంకులతో టైఅప్‌ పూర్తి చేశారు. భూసేకరణ పూర్తిచేశారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ. 149 కోట్లుఖర్చు చేశారు. వీటితోపాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతో పాటు ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులనూ తెచ్చారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగించడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ పూర్తిచేశారు కాబట్టి ప్రాజెక్టు 70శాతానికి పైగా పూర్తి అయినట్లే. జగన్‌ హయాంలో పనులన్నీ వేగంగా జరగడాన్ని గుర్తు చేసుకుంటూ.. మళ్లీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదని స్థానికులు పేర్కొంటున్నారు.  
‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ బహిరంగ సభకు హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు  

అడుగడుగునా ఆంక్షలు
వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. మూలపేట పోర్టుకు వెళ్లే రహదారులన్నీ పోలీ­సులు అష్ట దిగ్బంధనం చేశారు. కనీసం గ్రామ­స్తులు రావడానికి వీల్లేని విధంగా ఆంక్షలు పెట్టారు.  వైఎస్సార్‌సీపీ నాయకులెవరూ పోర్టు వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నౌపడ జంక్షన్‌ నుంచి పాలనాయుడుపేట జంక్షన్‌ వద్ద, యామల పేటకు వెళ్లే రహదారి వద్ద, రాజపురం జంక్షన్‌ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి బయట వ్యక్తులెవరూ పోర్టు ప్రదేశానికి  వెళ్లకుండా బారికేడ్లు, ముళ్ల కంచెలతో మోహరించారు. 

నౌపడ మూడు రోడ్లు జంక్షన్‌ నుంచి పోర్టుకు వెళ్లే రహదారిలో టిప్పర్లను అడ్డంగా పెట్టి దాని ముందు బారికేడ్లు పెట్టి ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మూలపేట గ్రామస్తులు కూడా తమ గ్రామానికి వెళ్లాలంటే ఆధార్‌ కార్డు చూపించాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. కొందరికి జీడి తోటలకు పరిహారం, పీడీఎఫ్‌ పరిహారం ఇవ్వలేదని, ఇంటి స్థలాలు కూడా  కేటాయించలేదని, నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండానే తరలిస్తున్నారని మూలపేట గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ నేతలకు వినతిప­త్రాన్ని అందజేశారు. 

కాగా ఈ కార్యక్ర­మంలో మాజీ మంత్రులు పీడిక రాజన్నదొర, పుష్ప­శ్రీవాణి, బూడి ముత్యాల నాయుడు, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్‌నాథ్, పసుపులేటి బాలరాజు, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్‌ చైర్మన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాసరావు, జల్లిపల్లి సుభద్ర, ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎంపీ సత్యవతి, ఎమ్మె­ల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవి బాబు, నర్తు­రామారావు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ఎం. విశ్వేశరరాజు, రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కరణం ధర్మశ్రీ, శంబంగి వెంకట చినప్పల­నాయుడు, వాసుపల్లి గణేశ్, అదీప్‌రాజ్, గొర్లె కిరణ్‌కుమార్, పెట్ల ఉమాశంకర్‌ గణేశ్, మళ్ల విజయప్రసాద్, శోభా హైమా­వతి, భాగ్యలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్, శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, కేకే రాజు, జెడ్పీ మాజీ చైర్మన్, జీసీసీ మాజీ చైర్మన్‌ గులిపల్లి శోభాస్వాతీరాణి తదితరులు హాజరయ్యారు.
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వేదికపై వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు 

జగన్‌కు పేరొస్తుందన్న కక్షతోనే..
ఒక ప్రభుత్వం కొనసాగిస్తున్న పనిని తర్వాత ప్రభుత్వం పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్‌ జగన్‌కు పేరు వస్తుందనే కక్షతో మూలపేట పనులు ఆపేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు భోగాపురం పోర్టులో రీల్స్‌ చేసుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ భూ సేకరణ, అనుమతులన్నీ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే చేసింది. రామ్మోహన్‌ నాయుడికి సమర్థత ఉంటే, తన శాఖ పరిధిలోని విశాఖ ఎయిర్‌ పోర్టు పనులను రెండేళ్లుగా ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు..? మీ మామూళ్ల కోసం ఇక్కడి పనులు సాగనివ్వరా..? అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నా మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించలేదు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టు పూర్తయి ఉండేది. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే అధికార పక్షం వారు ఇవాళ ప్రజాసంక్షేమం అంటూ మాట్లాడడం సిగ్గుచేటు. పోర్టు పనులను మేం పరిశీలిస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది? భయంతో ఎంతోకాలం మీరు పరిపాలన చేయలేరు. త్వరితగతిన పోర్టు పూర్తి చేయాలి. 
    – బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత    

టీడీపీ నేతలను తరిమికొట్టాలి..
ఐదేళ్ల పాలనలో వైఎస్‌ జగన్‌ సిక్కోలు వెనుక­బాటును రూపుమాపే ప్రాజెక్టులు తీసుకువ­చ్చారు. టీడీపీ పాతికేళ్ల పాల­నలో ఒక్క శాశ్వత ప్రాజెక్టు అయినా తీసుకురాలేదు. కేంద్రమంత్రి రామ్మో­హన్‌ నాయుడు జిల్లాకు ఏం చేశారో చూపగలరా..? మూలపేట పోర్టుకు అవసరమైన ఆర్థిక వనరులు, అనుమతులన్నీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే తీసుకువచ్చింది. టీడీపీ రెండేళ్లలో నయాపైసా ఇవ్వలేదు. ఏ రోజైతే జిల్లాలో టీడీపీని ప్రజలు తరిమి కొడతారో, ఆ రోజే వీరు భయపడి పనిచేస్తారు. ప్రైవేటు వ్యక్తులు కడుతున్న భోగాపురం ప్రాజెక్టుకు రామ్మోహన్‌ నాయుడు టూరిస్టులా వెళ్లి తామే కడుతున్నామని అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు రూ.3.50 లక్షల కోట్లు అప్పు తెచ్చి, అందులో రూ.1000 కోట్లైనా ఈ పేద జిల్లాకు పెట్టారా? వైఎస్‌ జగన్‌ పోర్టులు, హార్బర్లతో అభివృద్ధి వికేంద్రీకరణకు రూపకల్పన చేశారు. కానీ టీడీపీ నేతలు జిల్లాలో ఇసుక, మట్టి, రాయి దోచుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతానికి ఊపిరి పోసే విధంగా కిడ్నీ ఆస్పత్రి, హిరమండలం నుంచి సుజలధార ప్రాజెక్టుల ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కింది.   – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి    

రెండేళ్లలో ఒక్కశాతం పని చేయలేదు
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా మూలపేట పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వైఎస్‌ జగన్‌ హయాంలో పునరావాసం, భూసేకరణ, అనుమతులన్నీ పూర్తి చేసి కీలకమైన పనులు చేస్తే, వీరు అడ్డగోలుగా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. వైఎస్‌ జగన్‌ తెచ్చిన మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడానికి చూశారు. బుడగట్ల పాలెం జట్టీ, భోగాపురం అన్నీ జగన్‌ చలవే. అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసగించడమే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడులకు తెలిసిన పని.    
    – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్‌

ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా.. 
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటూ జిల్లాకు ఏమీ చేయకుండా చంద్రబాబు భజన చేయడం సిగ్గుచేటు. వలస వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోతున్న జిల్లా వాసుల కష్టాలను చూసి, పాదయాత్రలో జగన్‌ తయారుచేసిన బ్లూ ప్రింట్‌ ఫలితమే మూలపేట పోర్టు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడులకు ఛాలెంజ్‌ చేస్తున్నాను.. జిల్లాకు మీరు తెచ్చిన ఒక్క ప్రాజెక్టు అయినా చూపగలరా?. వైఎస్సార్, జగన్‌ హయాంలోనే జిల్లాకు వంశధార, రిమ్స్, పోర్టు, కిడ్నీ సెంటర్, మెడికల్‌ కాలేజీలు వచ్చాయి. అచ్చెన్నాయుడు గారూ.. అసెంబ్లీలో జగన్‌ను కాల్చేయాలంటున్నారు.. ఎవరిని కాల్చాలి? సంపదనంతా అమరావతిలో కేంద్రీకరిస్తున్న వారినా? లేక అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన జగన్‌నా..? 
    – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి  

వైఎస్‌ జగన్‌ చేసి చూపించారు
మూలపేట పోర్టు పూర్తయితే టెక్కలి ప్రాంతం ముంబైలా అభివృద్ధి చెందుతుంది. గతంలో భారీ భూసేకరణ సాధ్యం కాదని వాయిదా వేసిన ప్రాజెక్టును వైఎస్‌ జగన్‌ ఆచరణాత్మక ఆలోచనతో కేవలం 1,800 ఎకరాలతో సాధ్యమని నిరూపించి పనులు ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ సీఎం చేయని పనిని వైఎస్‌ జగన్‌ చేసి చూపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. కనీసం పనుల పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. మూలపేట పోర్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, ఫిషింగ్‌ హార్బర్, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌తో వైఎస్‌ జగన్‌ జిల్లాపై ప్రేమను చాటుకున్నారు. 
    – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

రెండేళ్లవుతున్నా ఎక్కడి పనులక్కడే..
దశాబ్దాలుగా టీడీపీ ఎన్నికల అజెండాగా మాత్రమే ఉన్న పోర్టును వైఎస్‌ జగన్‌ పట్టాలెక్కించి 70 శాతం పూర్తి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్లవుతున్నా మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థతతో ఉంది. పోర్టు పూర్తయితే వైఎస్‌ జగన్‌కు పేరు వస్తుందనే కుళ్లుతోనే పనులు ఆపేశారు. గతంలో టీడీపీ 5 వేల ఎకరాలు దోచుకోవాలని చూస్తే, జగన్‌ మాత్రం తక్కువ భూమితో, అత్యధిక పరిహారం ఇచ్చి ప్రాజెక్టు సాకారం చేశారు.   
    – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం

వాస్తవ రూపంలోకి తెచ్చింది జగనే
చాలామంది నేతల్లా శంకుస్థాపన రాయి వేసి వదిలేయకుండా, రూ.4,362 కోట్ల నిధులతో, నిర్వాసితులకు న్యాయం చేస్తూ పోర్టు పనులను వాస్తవ రూపంలోకి తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వాడుకుని 11 పోర్టులు నిర్మిస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందనే ముందుచూపు జగన్‌ది.     
– పిరియా విజయ, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్, శ్రీకాకుళం

మాట మీద నిలబడని బాబు
‘చెప్పాడంటే చేస్తాడు’ అనే క్రెడిట్‌ జగన్‌కే దక్కుతుంది. మాట తప్పడం చంద్రబాబు నైజం. 70 శాతం పనులు పూర్తయ్యాక వచ్చి, ఏమీ చేయకుండా కూర్చున్న కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
 – మత్స్యలింగం, అరకు ఎమ్మెల్యే

బాబాయి, అబ్బాయ్‌లదే పాపం
వలసల జిల్లా శ్రీకాకుళంలో రూ.4,362 కోట్లతో పోర్టు తెచ్చి, 25 వేల మందికి ఉపాధి, అందులో స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా జగన్‌ జీఓ తెచ్చారు. కానీ కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న బాబాయి, అబ్బాయిలు క్రెడిట్‌ జగన్‌కు వెళ్తుందనే కుట్రతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు.
    – సాడి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త  

జగన్‌ గెలిస్తేనే జిల్లా అభివృద్ధి
కిడ్నీ ఆస్పత్రి, మంచినీరు, పోర్టు వంటి ప్రాజెక్టులతో జగన్‌ జిల్లాకు దిక్సూచిలా నిలిచారు. కూటమి పాలనలో ఒక్క మంచి పనీ జరగలేదు. మళ్లీ జగన్‌ను గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యం.     
  – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే

అన్నీ అబద్ధాలే..
కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం. వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధించడం, క్రెడిట్‌ చోరీ మాత్రమే జరుగుతోంది. 71 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థే చెబుతుంటే, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. 40 ఏళ్లుగా మీ కుటుంబం జిల్లాకు చేసిందేమీ లేదు. 
    – పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త

బాబు చేసింది శూన్యం
శ్రీకాకుళం అభివృద్ధికి కీలకమైన వంశధార, కిడ్నీ సెంటర్, మెడికల్‌ కాలేజీ, పోర్టు అన్నీ వైఎస్‌ జగన్‌ తెచ్చినవే. 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు జిల్లాకు ఇచ్చింది శూన్యం.
– చింతాడ రవికుమార్                 

జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఈ పోర్టు
జిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దే. తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాన్ని వైఎస్‌ జగన్‌ మొదలుపెట్టారు. ప్రధానంగా 4 పోర్టుల నిర్మాణం, 8 ఫిషింగ్‌ హార్బర్స్‌ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన వైఎస్సార్‌సీపీది. కూటమి నేతలు మూలపేట పోర్టును తామే నిర్మించామని ప్రగల్బాలు పలకడానికి సిగ్గులేదా..?     – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు

మూలపేట కీలకం
మూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలపై ఉంది. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న శ్రీకాకుళం జిల్లా నుంచి దీనికి నాంది పలకడం చాలా సంతోషం. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్నా ఏ ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టకపోగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు ముందుకు కూడా రాకపోవడం దారుణం.     
    – బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కో–ఆర్డినేటర్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement