ఏపీలో పెట్రోల్, డీజిల్‌ సంక్షోభంపై వైఎస్ జగన్ ఆగ్రహం | YSRCP Chief YS Jagan Slams Chandrababu Over Fuel Shortage Crisis In AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. ఇది మీరు సృష్టించిన కృత్రిమ కొరతే: వైఎస్‌ జగన్‌

Apr 27 2026 9:05 PM | Updated on Apr 27 2026 9:26 PM

YSRCP Chief YS Jagan Slams Chandrababu Over Fuel Shortage Crisis In AP

తాడేపల్లి:  ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభం వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరతే అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని కొరత సృష్టించి వ్యాపారులకు దోచి పెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేతగాని పాలనకు నిదర్శనం అంటూ పెట్రోలు బంకుల దగ్గర వాహనదారుల ఇక్కట్ల వీడియోలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు వైఎస్‌ జగన్‌. 

విత్తనాలు దగ్గర నుంచి వంట గ్యాస్‌ వరకూ ఇదే పరిస్థితి
‘విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్‌ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్‌ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్‌ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదు. కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్‌ బ్లాక్‌ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జత కట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. అయినా నిజం ఒప్పుకోకుండా, సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్‌ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారు. 

వాస్తవం మీకు కూడా తెలుసు..
వాస్తవం ఏమిటన్నది మీక్కూడా తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్‌ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోంది. 

ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్‌ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయి. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్‌ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్‌పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు’ అని హెచ్చరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement