పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. లింగాల మండలంలోని గురువారం రాత్రి కురిసిన గాలి వానకు దెబ్బతిన్న అరటి పంటలను ఈరోజు(శనివారం, మే 23వ తేదీ) ఎంపీ అవినాష్ పరిశీలించారు.
దీనిలో భాగంగా ఎంపీ అవినాష్ మాట్లాడుతూ.. ‘పులివెందుల నియోజకవర్గంలో ఈనెల 21న వీచిన గాలివానకు భారీ ఎత్తున అరటిపంట నష్టం వాటిల్లింది. లింగాల, పులివెందుల, వేముల మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నేల కూలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2వేల ఎకరాల్లో అరటి చెట్లు నేలకూలాయి. ఇప్పటికే రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఓ వైపు సాగునీటి సమస్య...మరో వైపు గిట్టుబాటు ధరలు దొరకడం లేదు

అన్నిటినీ అదిగమించి మంచి దిగుబడి సాధించిన పకృతి ప్రకోపంతో వేల ఎకరాలు నేలకూలాయి. ఫలితంగా రైతుల కష్టం మొత్తం వృథా అయిన పరిస్థితి నెలకొంది. ఈ రోజున్న అరటి రేటుతో లెక్క కడితే ఎకరాకు 5లక్షల నుంచి 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.ఇలా 2వేల ఎకరాల్లో పంట నష్టం అంటే ఎంత భారీ నష్టం జరిగిందో అందరూ గమనించాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇటువైపు చూసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నా. ప్రభుత్వం ముందుకు వచ్చి తక్షణమే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలి. నష్టపోయిన ప్రతి రైతుకూ పంటల బీమాను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
గత ఏడాది మార్చిలోనూ ఇలానే గాలివానకు భారీగా అరటి పంటకు నష్టం చేకూరింది. అరటికి బీమా ఇవ్వాలంటే వెదర్ బేస్డ్ స్టేషన్లలో గాలివేగం నమోదును బట్టి ఉంటుంది. ఆ గాలి వేగం ఎంత ఉందో లెక్కిద్దామంటే ఆ వెదర్ స్టేషన్లు అసలు పనే చేయడం లేదు. అప్పట్లో నష్టపోయిన గ్రామాల్లో గాలివేగం రికార్డులు తీస్తే నాట్ అప్లికబుల్ అని వస్తోంది. ప్రస్తుతం ఈనెల 21న వచ్చిన గాలివేగం కూడా సక్రమంగా రికార్డ్ కాలేదు

గతంలోనే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులకు ఒకవైపు నీరు లేక, మరోవైపు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే ప్రకృతి కోపంతో మరింత రైతన్నలు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు.


