
తమ సమస్యలను వైఎస్ జగన్‌కు విన్నవిస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థులు
చంద్రబాబు కూటమి సర్కారుపై వైఎస్ జగన్ ఆగ్రహం
డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్‌యూపై శీతకన్ను తగదు
వెంటనే సీఓఏ అనుమతులకు కృషి చేయాలి
రెగ్యులర్ నియామకాలు చేపట్టి ఏడీసెట్ నిర్వహించాలి
న్యాయ పోరాటం చేద్దామని విద్యార్థులకు భరోసా
అక్రమ కేసుల్లో బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పిన మాజీ సీఎం
తమ పాలనలో తర, తమ, ప్రాంత, వర్గ భేదాలు చూడలేదని వెల్లడి
గండి ప్రధానాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, కడప/పులివెందుల: ప్రభుత్వాలు మారినంత మాత్రాన విద్యార్థులకు అన్యాయం చేయకూడదని, వ్యవస్థను దెబ్బ తీయడం సరికాదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ సమీపంలోని వీరన్నగట్టుపల్లె వద్ద మంగళవారం డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తోందని పి.సాయికృష్ణారెడ్డి, జగదీష్, సీహెచ్ శివతేజ, సౌమ్య, సుష్మ, నవ్య, రమేష్, హిన్నుపాల్, బిందు, శశిరేఖ తదితరులు ఆయనకు వివరించారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్‌యూ విద్యార్థులకు అండగా నిలుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.
పోలీసుల ఏకపక్ష చర్యలు సహించం
వైఎస్సార్ సర్కిల్స్‌లో టీడీపీ తోరణాలు తొలగించారనే సాకుతో అక్రమ కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పులివెందులకు చెందిన కిశోర్, రాజేష్, మల్లికార్జున, మస్తాన్, వెంకటపతి, వెంకటచలపతి తదితరులు వైఎస్ జగన్‌ను కలిసి కష్టాన్ని చెప్పుకున్నారు. వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరించారు. చేయని నేరానికి శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ పార్నపల్లెకు చెందిన ఆశోక్‌రెడ్డి వైఎస్ జగన్‌ను కలిసి పరిస్థితి వివరించారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. పోలీసుల ఏకపక్ష చర్యల్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో తగిన శాస్తి తప్పదని, ఎవరూ అధైర్యపడొద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. మనం అధికారంలో ఉండగా తర, తమ, ప్రాంత, వర్గ భేదాలు లేకుండా పాలన అందించామని గుర్తు చేశారు. రాబోవు రోజుల్లో తప్పకుండా న్యాయం చేస్తామని వారికి ధైర్యం చెప్పారు.
గుడి, బడులను కూడా వదల్లేదు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.28 కోట్లు వెచ్చించి గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేసిందని, అయితే ప్రధానాలయం పూర్తయ్యి ఆరు నెలలైనా పునఃప్రతిష్ట పట్ల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆలయ చైర్మన్ కృష్ణ తేజ వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే శ్రావణ మాసం వీరాంజనేయస్వామికి అత్యంత ప్రీతిపాత్రమని, భక్తులంతా ఆలయ పునః ప్రతిష్ట త్వరగా చేపట్టాలని కోరుతున్నారని చెప్పారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వం గుడి, బడులను కూడా వదలకుండా రాజకీయాలు చేస్తూ అవినీతికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణ మాసంలో దేవస్థానం ప్రధాన ఆలయం భక్తులకు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీని నిర్వీర్యం చేస్తారా?
» కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం
» ప్రభుత్వం హామీ ఇవ్వకపోవడం వల్లే ఇప్పటికీ సీవోఏ ఆమోదం పెండింగ్
» కొత్త విద్యార్థులను చేర్చుకోవడానికి ఇప్పటికీ ఏడీ సెట్ పరీక్ష నిర్వహించలేదు
» కనీసం ఏడీ సెట్‌కు కన్వీనర్‌ను కూడా నియమించ లేదు
» మేలుకో బాబూ అంటూ సీఎం చంద్రబాబుకు చురక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సమున్నతాశయంతో 2020–21లో స్థాపించిన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తారా? అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వక పోవడం వల్లే ఆ యూనివర్సిటీకి సీవోఏ (కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్) ఆమోదం తెలిపే ప్రక్రియ ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని ఎత్తిచూపారు.
‘ఈ ప్రభుత్వం నిద్రాణ స్థితి నుంచి మేల్కొంటుందని ఆశిస్తున్నాను.. మేలుకో బాబూ’ అంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మంగళవారం ఆయన పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం జేఎన్‌ఏఎఫ్‌ఏయూ (జవహార్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్)ను విభజించడంలో విఫలమైంది. మా ప్రభుత్వం 2020–21లో కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించింది.
ఆ వర్సిటీకి ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), యూజీసీ (యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) అనుమతి ఇచ్చింది. కానీ.. కోవిడ్ మహమ్మారి ప్రబలడంతో ఆ సమయంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీవోఏ) ఆ యూనివర్సిటీలో తనిఖీలు నిర్వహించలేకపోయింది. సీవోఏను ఒప్పించడంతో 2023 అక్టోబర్‌లో తనిఖీకి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మొదటి మూడు బ్యాచ్‌లకు ఆమోదం తెలిపేందుకు 2024 జూలై 1న తనిఖీ చేసింది. అయితే వైస్ ఛాన్సలర్ నుంచి ఎటువంటి హామీ లేకపోవడం వల్ల ఇప్పటికీ ఆమోదం పెండింగ్‌లో ఉంది. దురదృష్టవశాత్తు ప్రస్తుత ప్రభుత్వం ఆ యూనివర్సిటీని ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు.
2023–24, 2024–25 బ్యాచ్‌లకు సీవోఏ అనుమతులు మా ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. కానీ.. ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ల బ్యాచ్ కోసం తక్షణమే ప్రభుత్వం స్పందిస్తుందని ఆశించాం. దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రభుత్వం కొత్త విద్యార్థులను చేర్చుకోవడానికి ఇప్పటి వరకు ఏడీ సెట్ పరీక్ష నిర్వహించలేదు. ఏడీ సెట్‌కు ఇంకా కన్వీనర్‌ను కూడా నియమించలేదు. పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ ప్రభుత్వం నిద్రాణస్థితి నుంచి మేల్కొంటుందని ఆశిస్తున్నాను. మేలుకో బాబూ..’ అని సీఎం చంద్రబాబుకు చురక అంటించారు.