
పులివెందులలో కార్యకర్తలు, నేతలకు వైఎస్ జగన్ భరోసా
క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
నేడు వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్‌కు నివాళులు
సాక్షి ప్రతినిధి, కడప/పులివెందుల: కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా ఉంటానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆయన పులివెందుల చేరుకున్నారు. భాకరాపురం హెలిప్యాడ్‌కు సాయంత్రం 5.15 గంటలకు సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలసి వచ్చారు. అనంతరం నేరుగా తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులను పేరు పేరునా ఆప్యాయంగా పలకరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు.
వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కార్
పులివెందులలో దివంగత వైఎస్సార్ విగ్రహాలపై ఉన్న టీడీపీ తోరణాలు తొలగించారంటూ పోలీసులు పలువురిపై హత్యాయత్నం కేసు బనాయించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో తమపై తప్పుడు కేసులను మోపుతున్నారని బెయిల్‌పై విడుదలైన మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్‌తోపాటు పార్టీ ఇతర నేతలు వైఎస్ జగన్‌కు తెలిపారు. టీడీపీ నాయకుడిపై దాడి చేశామంటూ తమపై హత్యాయత్నం కేసు బనాయించారని, ఆపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని వెల్లడించారు.
మెడికల్ టెస్టులు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు వారికి అనుకూలంగా నివేదిక ఇప్పించుకునేందుకు ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలిగానీ.. కీడు చేయకూడదన్నారు.
వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
దాల్మియా సిమెంటు కర్మాగారం కోసం భూములిచ్చిన నిర్వాసితులకు యాజమాన్యం అన్యాయం చేస్తోందని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సర్పంచ్ జగదీశ్వరరెడ్డి, ఎంపీటీసీ భాస్కరరెడ్డితో పాటు కలిసి వచ్చిన రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. లేబర్ కాంట్రాక్టు పనులు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. లోకాయుక్త సైతం రైతుల డిమాండ్‌లో న్యాయం ఉందని విశ్వసించినా అటు పరిశ్రమ యాజమాన్యం, ఇటు ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని తెలిపారు. సావధానంగా సమస్యను ఆలకించిన వైఎస్ జగన్.. రైతులకు న్యాయం చేసేందుకు ముందుంటామని చెప్పారు.
» వేముల మండలం పెర్నపాడు గ్రామ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అన్నారెడ్డి చంద్రఓబుళరెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసి తీవ్రమైన కాలి నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనిపై వైఎస్ జగన్ వెంటనే స్పందిస్తూ... చంద్రఓబుళరెడ్డికి అవసరమైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఆదేశించారు.
వైఎస్ జగన్‌ను కలసిన నేతలు
కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్‌యాదవ్, రామచంద్రారెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, ఎస్ రఘురామిరెడ్డి, గంగుల నాని, కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సతీష్‌కుమార్‌రెడ్డి, రమేష్‌కుమార్‌రెడ్డి తదితరులు భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.