
భీమబోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని పరిశీలించనున్న మాజీ సీఎం
7న పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
8వ తేదీన భీమవరం(పెద అమిరం)లో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవడంలో భాగంగా భీమబోయినపాలెంలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను మాజీ సీఎం వైఎస్ జగన్ సందర్శిస్తారు.