దివంగత పారిశ్రామికవేత్త కుమార్తె రాజరాజేశ్వరి విన్నపం
తన చెల్లెళ్లు ఆస్తులు లాక్కుంటున్నారని ఆవేదన
వారిలో ఒకరు రామోజీ కోడలు
కృష్ణా జిల్లా: తనకు, తన ఆస్తులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని దివంగత పారిశ్రామికవేత్త యెర్నేని జానకిరామయ్య పెద్ద కుమార్తె శ్రీరాజరాజేశ్వరి కోరారు. శనివారం కృష్ణా జిల్లా గంగూరులో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి యెర్నేని జానకిరామయ్య నుంచి తనకు గోడౌన్లు, ఇతర ఆస్తులు సంక్రమించాయని చెప్పారు. గంగూరులో 1988 నుంచి ఆస్తులు తన స్వాధీనంలో ఉన్నాయని, ప్లాన్లు, విద్యుత్ బిల్లులు కూడా తన పేరుతోనే ఉన్నాయని తెలిపారు. తన సోదరీమణులు అమరేశ్వరి, విజయేశ్వరి (ఈనాడు రామోజీరావు కోడలు) తన ఆస్తులు కాజేయాలని దౌర్జన్యం చేయిస్తున్నారన్నారు.
గోడౌన్లు పగులగొడుతున్నారని తెలియటంతో తాను ఈ నెల 14న వచ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు అసలు పట్టించుకోలేదని తెలిపారు. పైగా తనతో వచ్చిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. బంధువైన బీజేపీ నాయకుడు దిలీప్ కొందరిని తీసుకొచ్చి తన మనుషులపై దాడులు చేయించాడని, తనను బెదిరిస్తున్నాడని అన్నారు. గంగూరులోని స్థలంలో ఈనాడు, ప్రియా ఫుడ్స్ పెట్టడానికి యత్నిస్తున్నారని చెప్పారు. ఫిలింసిటీ నుంచి 70 మందిని తీసుకు వచ్చి పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. తాను పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, ప్రభుత్వం తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని శ్రీరాజరాజేశ్వరి కోరారు.


