ఈ సంక్షేమం ఆగకూడదు

YCP Bus yatra in Kakinada: Andhra pradesh - Sakshi

వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంను చేస్తేనే సంక్షేమం కొనసాగుతుంది 

జగన్‌ వచ్చాకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆత్మగౌరవం 

వయో పరిమితి 60 ఏళ్లకు తగ్గించి అవ్వాతాతలకు 

పెన్షన్‌ ఇస్తున్న మనసున్న సీఎం జగన్‌ 

అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,760 ఇస్తున్నారు 

కాకినాడ సామాజిక సాధికార సభలో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతే రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందుతోందని, అట్టడుగు వర్గాల సామాజిక సాధికారత సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఈ సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ను ఎన్నుకోవాలని తెలిపారు.

కాకినాడ రూరల్‌ సర్పవరం జంక్షన్‌లో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవంతో బతకగలుగుతున్నారని మంత్రి తెలిపారు. వయో పరిమితిని 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించి, అవ్వాతాతలకు పెన్షన్‌ ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని చెప్పారు.

అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,760 ఇస్తానని చెప్పి, ఇప్పటికే మూడు విడతలు అందించారని, జనవరిలో నాలుగో విడత కూడా ఇవ్వనున్నారని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేశారన్నారు. అదే అక్కచెల్లెమ్మలకు 2019 ఏప్రిల్‌ వరకూ ఉన్న బకాయిలు చెల్లిస్తామన్న జగన్‌ దానిని అమలు చేసి చూపించారన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని తెలిపారు. 

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తొలిసారిగా గౌరవాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. జగన్‌ సీఎం అయ్యాక బీసీ ఉప కులాలన్నింటినీ గుర్తించి, 57 కార్పొరేషన్లకు తొలిసారి చైర్మన్లను నియమించి, వారికి సరైన గుర్తింపు, గౌరవం కల్పించారని తెలిపారు.  

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఉప ముఖ్యమంత్రి పదవులు, మంత్రి వర్గంలో, ఇతర నామినేటెడ్‌ పదవులన్నింటిలో పెద్ద పీట వేసిన సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమేనని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ చెప్పారు. ఇన్నాళ్లూ మాటలకే పరిమితమైన సామాజిక సాధికారతను సీఎం జగన్‌ చేతల్లో చూపించారని అన్నారు.

చంద్రబాబు మంత్రివర్గంలో ఎస్సీ, మైనార్టీలకు స్థానమే కల్పించలేదన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబుకు ఆయన కులమే కనిపిస్తుందని, సీఎం జగన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపిస్తారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. సీఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌కు బడుగు, బలహీన వర్గాలే ప్రాధాన్యత అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. రాజ్యసభకు తొమ్మిది మందికి అవకాశం వస్తే అందులో మత్స్యకార వర్గం నుంచి తనకు, శెట్టిబలిజల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, యాదవ నుంచి బీద మస్తాన్‌రావు, కురుబ నుంచి ఆర్‌. కృష్ణయ్యలకు ప్రాతినిధ్యం కల్పించి రాజకీయంగా అగ్రస్థానంలో కూర్చోబెట్టారన్నారు. అవే పదవులను కోట్లకు అమ్ముకున్న నైజం చంద్రబాబుదని చెప్పారు. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లభించిన గౌరవం 2024 తర్వాత ఆగిపోకూడదంటే సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. ఎవరైనా పార్టీ పెడితే సీఎం కావాలనుకుంటారని, కానీ పక్కవారు సీఎం కావాలని కోరుకునే నాయకులు మనకు అవసరమా అంటూ పవన్‌ కళ్యాణ్‌ తీరును ఎద్దేవా చేశారు. బలిసిన వారికి, బడుగులకు  మధ్య జరుగుతున్న యుద్ధంలో బడుగుల పక్షాన నిలిచిన జగన్‌కు మద్దతుగా నిలిచి మరోసారి సీఎంను చేయాలని కోరారు.

సామాజిక సాధికారతకు అర్థం చెప్పేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన అందించారని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు చెప్పారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top