బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసుల కాల్పులు | Yadiki Boy Case: Police Open Fire On Accused | Sakshi
Sakshi News home page

బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

Mar 27 2026 7:16 AM | Updated on Mar 27 2026 8:50 AM

Yadiki Boy Case: Police Open Fire On Accused

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపిన కసాయి బావ సర్వేష్ పై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామంలో ఏడేళ్ల బాలుడు హేమచంద్రను డబ్బు కోసం సొంత బావ సర్వేష్ కిడ్నాప్ చేశాడు. అనంతరం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి హత్య చేశాడు. 

నిందితుడు సర్వేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితుడు సర్వేష్ పారిపోయేందుకు యత్నించారు. సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్‌పై బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఈ సమయంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో నాలుగు రౌండ్లు గాలిలోకి.... రెండు రౌండ్లు మోకాళ్ల కిందకు కాల్చారు. దీంతో నిందితుడు సర్వేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు.

యాడికి మండలం కోన ఉప్పలపాడులో గురువారం దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్తి కోసం ఏడేళ్ల బాలుడిని సొంత బావే రాళ్లతో కొట్టి కిరాతకంగా చంపేశాడు. గ్రామానికి చెందిన బోయ గోవిందు, లక్ష్మి కాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు హేమచంద్ర (7) ఉన్నారు. పెద్ద కుమార్తెను యాడికి మండలం నిట్టూరుకి చెందిన సర్వేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి సర్వేష్‌ అత్తింటి ఆస్తిపై కన్నేశాడు.

అదనపు కట్నం, ఆస్తిలో వాటాపై పలుమార్లు పంచాయితీలు సైతం జరిగాయి. బుధవారం యాడికి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సులో సొంతూరికి చేరుకున్న హేమచంద్రను సర్వేష్‌ కిడ్నాప్‌ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సర్వేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసం హేమచంద్రను కుందనకోట కొండల్లో హత్య చేసి, రాళ్ల మధ్య పాతి పెట్టానని విచారణలో నిందితుడు వెల్లడించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement