World Thalassemia Day: పెళ్లికి ముందు ఈ జాగ్రత్తలు మేలు!

World Thalassemia Day 2021: How It Inherited And Symptoms - Sakshi

అంతులేని వేదన.. మామయ్య లాలన

జిల్లాలో 152 మంది చిన్నారులకు తలసీమియా  

ప్రత్యేక పింఛన్‌ ద్వారా ఆదుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

నేడు వరల్డ్‌ తలసీమియా డే 

తలసీమియా అంటే గ్రీకు భాషలో సముద్రం అని అర్థం. సముద్రమంతటి సమస్యలు తలసీమియా బాధిత చిన్నారులను వేధిస్తున్నాయి. ఇలాంటి జీవితం ఎన్నాళ్లో వైద్యులు సైతం చెప్పలేని పరిస్థితి. కానీ ఉన్నన్నాళ్లూ చిన్నారుల ముఖాల్లో నవ్వులు పూయించడానికి ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి నెలా రూ.10 వేల పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటున్నారు. నేడు (మే 8) ప్రపంచ తలసీమియా దినం సందర్భంగా  ప్రత్యేక కథనం.. 


ఈ పాప పేరు ఎం.లక్ష్మి. తండ్రి పేరు ఎం.వీరేష్‌. పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామం. పాపది బి పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూపు. పుట్టుకతోనే  తలసీమియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.  దీంతో ప్రతి నెలా రెండుసార్లు రక్తం ఎక్కిస్తున్నారు. 

 ఈ అబ్బాయి పేరు పవన్‌నాయక్‌. వయసు నాలుగేళ్లు. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి తండా. పుట్టిన మూడో నెలలోనే తలసీమియా బయటపడింది. అప్పటి నుంచి ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కిస్తూ వస్తున్నారు. వీరిద్దరికే కాకుండా...జిల్లాలోని తలసీమియా బాధితులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.10 వేల చొప్పున పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటోంది.

తలసీమియా వ్యాధి అంటే... 
మానవుని శరీరంలోని ఎముక మూలుగలో  ఎర్రరక్తకణాల ఉత్పత్తి నిలిచిపోవడాన్నే తలసీమియా అంటారు. ఇది జన్యు సంబంధమైన వ్యాధి. మేనరికపు వివాహాలు చేసుకున్న తల్లిదండ్రుల మూలంగా చాలా వరకు పిల్లల్లో వస్తోంది. తలసీమియా బాధితుల్లో శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తి అయినా ఎక్కువ కాలం ఉండదు. హిమోగ్లోబిన్‌ నిల్వలు దారుణంగా  పడిపోయిన ప్రతిసారీ కృత్రిమంగా రక్తం అందించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయి. 

లక్షణాలు ఇవీ.. 

  • అడుగుతీసి అడుగు వేయలేరు. చిన్న చిన్న బరువులూ మోయలేరు.  నీరసం, నిస్సత్తువ కుంగదీస్తాయి.  
  • ఎముకల్లో పటుత్వం సన్నగిల్లుతుంది.  
  • జీర్ణశక్తి మందగిస్తుంది. 
  • పొట్టలావెక్కుతుంది.  
  • ఆరోగ్యం సహకరించక బడిలో గైర్హాజరు రోజులు పెరుగుతాయి. 

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో 152 మంది చిన్నారులు తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారు. వీరందరూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో చికిత్స తీసుకుంటున్నారు. వయసును బట్టి నెలకు ఒకట్రెండుసార్లు రక్తం ఎక్కించుకోవాల్సి వస్తోంది. చికిత్స, ప్రయాణ ఖర్చుల కోసం ప్రతి నెలా తల్లిదండ్రులకు రూ.3 వేలకు పైగా ఖర్చు అవుతోంది. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలోనే స్పందించారు. వారికి నవరత్నాలు పథకంలో భాగంగా ప్రతి నెలా రూ.10 వేల ప్రత్యేక పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మేరకు జిల్లాలో 152 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.10 వేల చొప్పున పింఛన్‌ ఇస్తున్నారు.   

పెళ్లికి ముందు ఈ జాగ్రత్తలు మేలు 
మేనరికపు వివాహం వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే తలసీమియా వ్యాధిని ఆదిలోనే అంతం చేయవచ్చు. అయితే చేయాల్సిందల్లా పెళ్లికి ముందే వధూవరులు కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌(సీబీసీ), హెచ్‌బీఏ 2లెవెల్‌ పరీక్షలు చేయించుకోవాలి. ఇద్దరిలో ఒకరైనా తలసీమియా వాహకులు కాదని తేలితే  నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇద్దరూ తలసీమియా వాహకులైతే వారికి జన్మించబోయే బిడ్డకు  వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా  ఉంటాయి. రక్త సంబంధీకుల్లో తలసీమియా వ్యాధి లక్షణాలు ఉన్నాయంటే మరింత జాగ్రత్త పడాలి. 

నేడు అవగాహన సదస్సు 
వరల్డ్‌ తలసీమియా డేను పురస్కరించుకుని కర్నూలు తలసీమియా పీపుల్‌ వెల్ఫేర్‌ సొసైటీ, సక్ష్యం ఆధ్వర్యంలో శనివారం జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు బి.శ్రీకాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సదస్సులో పాల్గొనదలచిన వారు 8790705005 నంబర్‌కు కాల్‌ చేస్తే జూమ్‌ లింక్‌ షేర్‌ చేస్తామని తెలిపారు.  జెనెటిక్‌ కౌన్సెలింగ్‌తో వ్యాధి రాకుండా చేయొచ్చు 

తలసీమియా జన్యు సంబంధిత వ్యాధి. బాధితులకు ప్రతి నెలా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఎముక మూలుగ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు.  కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే మొదటి సంతానంగా తలసీమియా వ్యాధి ఉన్న బిడ్డ కలిగితే రెండో సంతానంలో అలాంటి బిడ్డ జన్మించకుండా ఆపొచ్చు. ఇందుకోసం పలురకాల వైద్యపరీక్షలు, జెనెటిక్‌ కౌన్సెలింగ్‌ చేస్తారు.  
–డాక్టర్‌ అమరనాథ్‌రెడ్డి, చిన్నపిల్లల వైద్యులు, కర్నూలు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top