షిప్‌యార్డ్‌ దుర్ఘటనపై కేసు నమోదు 

Visakhapatnam Hindustan Shipyard Crane Accident Incident - Sakshi

10 కుటుంబాల్లో విషాదం నింపిన క్రేన్‌

షిప్‌యార్డ్‌లో ప్రమాదంతో రోడ్డున పడ్డ కుటుంబాలు  

పారిశ్రామిక నగరంలో మిన్నంటిన రోదనలు 

పాతపోస్టాఫీసు/మునగపాక/ గోపాలపట్నం/తుమ్మపాల: హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో భారీ క్రేన్‌ కూలిన ఘటన.. 10 మంది  కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అందమైన జీవితాలు.. ఆనందంగా సాగుతున్న వేళ.. పిడుగులాంటి ఈ వార్త.. ఆ కుటుంబాలను కకావికలం చేసింది. ఎదిగిన పిల్లలను తల్లిదండ్రులకు కాకుండా చేసింది. ముక్కు పచ్చలారని చిన్నారులకు తండ్రి ప్రేమను దూరం చేసింది. అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితంలో పెను తుపాను సృష్టించింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారు ఇలా అర్ధాంతరంగా దుర్మరణం  చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను కేజీహెచ్‌ మార్చురీలో భద్రపరిచారు. మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. వారిని చూసిన వారు కూడా  కన్నీరుమున్నీరయ్యారు.  

షిప్‌యార్డ్‌ దుర్ఘటనపై కేసు నమోదు 
మల్కాపురం (విశాఖ పశ్చిమ): షిప్‌యార్డ్‌లో శనివారం జరిగిన ఘోర ప్రమాదంపై సెక్యూరిటీ ఆఫీసర్‌ సుశీల్‌కుమార్‌ మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన అనుపమ క్రేన్‌ కంపెనీ యజమానిపై, గ్రీన్‌ ఫీల్డ్‌ కంపెనీ యజమానిపై సెక్షన్‌ 304ఏ కేసు నమోదు చేశారు. ఈ కేసు సౌత్‌ ఏసీపీ టేకు రామ్మోహన్‌రావు నేతృత్వంలో మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్‌ దర్యప్తు చేస్తున్నారు. 

చిన్నాన్న వద్దే పెరిగాడు  
కంచరపాలెం ఊరశ్వి థియేటర్‌ సమీపంలో నివాసం ఉంటున్న బహదూర్‌ షా చైతన్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే కోల్పోయారు. చైతన్యకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వీరందరినీ చైతన్య చిన్నాన్న జగన్మోహనరావు తన ఇద్దరు కూతుళ్లతో పాటు పెంచి పెద్ద చేశారు. ఇంటిలో ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో అతని రోదనకు అంతులేకుండా పోయింది.గ్రీన్‌ఫీల్డ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.
 
బహదూర్‌షా చైతన్య (25) మృతుడు 

ఎవరూ సమాచారం ఇవ్వలేదు 
చిన్న తనం నుంచి చైతన్యను నేనే పెంచి పెద్ద చేశాను. నా కొడుకు మరణించిన విషయాన్ని టీవీలో చూసి తెలుసుకుని ఇక్కడకు వచ్చాను. షిప్‌యార్డ్‌ కంపెనీ సిబ్బంది గానీ, నా కొడుకు పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కంపెనీ సిబ్బంది గానీ సమాచారం ఇవ్వలేదు. ఎదిగిన కొడుకు మరణించడంతో నా కుటుంబం విషాదంలో మునిగిపోయింది.  –జగన్మోహనరావు, చైతన్య చిన్నాన్న 

ఆరోగ్యం బాగాలేదు.. సెలవు పెడతానన్నారు
మృతుడు పీలా శివకుమార్‌ (35) కాంట్రాక్ట్‌ లేబర్‌. ఆయనకు భార్య సుమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెతో పాటు శివకుమార్‌ సోదరి శ్రీదేవి కేజీహెచ్‌ మార్చురీ వద్దకు చేరుకున్నారు. భర్త మరణంతో ఇద్దరు పిల్లలతో తాను రోడ్డున పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 16 ఏళ్లుగా కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ రోజు ఆరోగ్యం బాగాలేదు.. ఉద్యోగానికి సెలవు పెడతానని చెప్పారు. కానీ తోటి స్నేహితులు ఉద్యోగానికి వెళ్లిపోతున్నారని చెప్పి వెళ్లారని.. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని రోదించారు. గోపాలపట్నంలోని జయప్రకాష్‌ నగర్‌లో పిల్లా శివకుమార్‌ కుటుంబం నివసిస్తోంది. ఆయన మృతి చెందడంతో ఆ కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి.  

మంచివాడిగా పేరు
ఐబీసీ వెంకటరమణ (42) 13 ఏళ్లుగా షిప్‌యార్డ్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. మంచివాడన్న పేరు సంపాదించుకున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా గాజువాకలో నివాసం ఉంటున్నారు. 

టీవీలో చూసి షాక్‌ అయ్యాను 
ఎప్పటిలా ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం టీవీలో విషయం చూసి సంఘటనా స్థలంలో నా భర్త ఉన్నాడో లేడో తెలుసుకోడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నా బంధువులు మార్చురీ వద్దకు వచ్చి విషయం తెలుసుకుని చెబితే వచ్చాను.  – సత్యశ్రీ నాగలక్ష్మి, మృతుడు వెంకటరమణ భార్య  

విషాదంలో ఉమ్మలాడ
ఉమ్మలాడ గ్రామానికి చెందిన మొల్లేటి వెంకట సూర్యనారాయణ, కాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సత్యనారాయణ డాక్‌యార్డులో పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు ఎం.ఎన్‌.వెంకటరావు (35). నాగేశ్వరరావు కూడా అని పిలుస్తుంటారు. ఆరేళ్ల పాటు దుబాయ్‌లో వెల్డర్‌గా పనిచేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చాక డాక్‌యార్డులో రెండేళ్ల కిందట వెల్డర్‌గా చేరాడు. ఇటీవలే డాక్‌యార్డులో పని మానేసి.. షిప్‌యార్డ్‌కు కాంట్రాక్ట్‌ పనులు చేపట్టే గ్రీన్‌ఫీల్డ్‌ కంపెనీలో చేరాడు. శనివారం జరిగిన ప్రమాదంలో నాగేశ్వరరావు ప్రాణాలు విడిచాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి. అందరితో సఖ్యతగా ఉండే నాగేశ్వరరావు మృతి చెందడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన నాగేశ్వరరావు మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడు నాగేశ్వరరావుకు భార్య లలిత, అయిదేళ్ల దమరుకేష్, మూడేళ్ల శ్రీజలు ఉన్నారు. అభం శుభం తెలియని చిన్నారులను చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఉమ్మలాడ సర్పంచ్‌ అభ్యర్థి సూరిశెట్టి రామకృష్ణ విషయం తెలిసిన వెంటనే కేజీహెచ్‌కు వెళ్లారు.

విషాదవదనంలో కుటుంబసభ్యులు (ఇన్‌సెట్‌) క్రేన్‌ ప్రమాదంలో మృతి చెందిన నాగేశ్వరరావు   

కుటుంబం రోడ్డున పడింది 
షిప్‌యార్డ్‌ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో పొదినాను భాస్కరరావు(35) నివాసం ఉంటున్నాడు. లీడ్‌ ఇంజినీరింగ్‌ సంస్థలో మూడేళ్లుగా కాంట్రాక్ట్‌ పద్దతిపై పనిచేస్తున్నాడు. భాస్కరరావు మరణంతో ఆ కుంటుంబం రోడ్డున పడింది.  – వెంకటేశ్వరరావు, భాస్కరరావు సోదరుడు 

మిన్నంటిన రోదనలు  
షిప్‌యార్డ్‌లో జరిగిన ప్రమాదంలో అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన పల్లా నాగదేముళ్లు (35) దుర్మరణం చెందాడు. అందరితో సరదాగా ఉండే నాగు షిప్‌యార్డు ఫిట్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. మృతి చెందాడన్న వార్తతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగుకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం భార్య, ఇద్దరు పిల్లలతో విశాఖలోనే నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు పల్లా సుబ్రహ్మణ్యం, దేముడమ్మతో పాటు సోదరుడు, సోదరి కూండ్రంలోనే ఉంటున్నారు. కుటంబానికి పెద్ద దిక్కుగా ఉండే కుమారుడు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కూండ్రం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.  

ఎలా బతుకుతారో..
కంటుముచ్చు సత్తిరాజు (51) గతంలో పని చేసిన ఎండీ సొసైటీ నుంచి ఎల్‌ సిరీస్‌ కంపెనీలోకి మారాడు. అతని తండ్రి ప్రమాదవశాత్తూ గతంలో చనిపోతే ఆ ఉద్యోగాన్ని సత్తిరాజుకు ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలతో మల్కాపురంలో కాపురం ఉంటున్నాడు. 30 ఏళ్లుగా కంపెనీలో పనిచేసినా ఏమాత్రం వెనకేయలేదని, రేపటి నుంచి భార్యా బిడ్డలు ఎలా బతుకుతారో అర్థం కావడం లేదని అతని తమ్ముడు లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు.  

షిప్‌యార్డ్‌ ప్రమాద  బాధితులను ఆదుకోండి: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలియగానే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి  సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరగా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top