వైభవంగా ద్విసహస్ర గళ పద్యార్చన 

Vice President M Venkaiah Naidu at vijayawada - Sakshi

విజయవాడ కేబీఎన్‌ కళాశాలలో నిర్వహణ

108 పద్యాలను ఆలపించిన 2,000 మంది విద్యార్థులు

వన్‌టౌన్‌(విజయవాడ పశ్చిమ): ప్రతి వ్యక్తి జీవితంలో మాతృభాష భాగమైనప్పుడే ఆ సమాజ భాషా సంస్కృతులు కలకాలం శోభిల్లుతాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్ర మహాభారత సహస్రాబ్ది మహోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్‌ కళాశాలలో మంగళవారం ద్విసహస్ర గళ పద్యార్చన వైభవంగా నిర్వహించారు. రెండు వేల మంది విద్యార్థులు సామూహికంగా 108 పద్యాలను ఆలపించి నన్నయకు నీరాజనాలు పలికారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ భాషకు లేని మనదైన గొప్ప సంపద తెలుగు పద్యం అని అన్నారు.

ఇటీవల తెలుగు అధికార భాషా సంఘం ఆధ్వర్యాన పరవస్తు చిన్నయసూరి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మా­ట్లా­డుతూ ఆదికవి నన్నయ కామధేనువు వంటివారని, ఆయన అందించిన కావ్యం అనేక గ్రంథాలకు స్ఫూర్తిని చ్చిందని తెలిపారు. తొలుత సాహితీవేత్త వాడ్రేవు సుందరరావు నన్నయ్య ఏకపాత్రాభినయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జ్ఞానమణి, సబ్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ ప్రసంగించారు. కేబీఎన్‌ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు టి.శేషయ్య, టి.శ్రీనివాసు, కోశాధికారి ఎ.రామకృష్ణారావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు, డాక్టర్‌ కె.రామకృష్ణ, డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ జేవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top