రాష్ట్రంలో భిన్న వాతావరణం | Varying weather pattern may continue in AP | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో భిన్న వాతావరణం

Jun 2 2026 4:45 AM | Updated on Jun 2 2026 4:45 AM

Varying weather pattern may continue in AP

విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ వానలతో భిన్నవాతావరణం నెలకొందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కేరళ వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి,  పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్‌ కడప, తిరుపతి జిల్లాల్లో  పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.     ఆకస్మికంగా ఉరుములతో  వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్స్‌ కింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలన్నారు. గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్‌ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వీలైనంత దూరంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఎండ తీవ్రత ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement