
నెల్లూరు(సెంట్రల్): గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి జిల్లాలో అపూర్వ స్పందన వస్తోంది. ఇందులో భాగంగా స్వయంగా ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల వద్దకు వెళ్తుండగా వారు ఆనందించి ఆశీర్వదిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అవి తమకు అందుతున్నాయని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా తమకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎల్లవేళలా తమ ఆశీస్సులుంటాయని దీవిస్తున్నారు.
పక్కాగా పథకాల అమలు
కందుకూరు నియోజకవర్గంలోని పలుకూరు ప్రాంతంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన చిన్న సమస్యలను ఎమ్మెల్యే అక్కడే పరిష్కరిస్తుండడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మానుగుంట మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. అర్హులకు పక్కాగా పథకాలు అందిస్తున్నామని, అదే విధంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ప్రజలకు అండగా ప్రభుత్వం
వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలం దేవరవేమూరు ప్రాంతంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు స్థానికులు సాదర స్వాగతం పలికారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆనందం వ్య క్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా భరోసా కల్పించినట్లు చెప్పారు.
ఇంకా అభివృద్ధి చేస్తాం
ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి మున్సిపల్ పరిధిలోని 12, 13 వార్డుల్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపలో ఆయనకు ఆత్మీక స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రజలకు విక్రమ్‌రెడ్డి సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరికీ ఎంతో బాధ్యతగా అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేశామని, ఇంకా చేస్తామని తెలిపారు.