సమీకరణకు భూములివ్వం | Undavalli Farmers Big Shock to Cm Chandrababu Over Second Phase of Land Pooling for Capital | Sakshi
Sakshi News home page

సమీకరణకు భూములివ్వం

May 11 2026 5:43 AM | Updated on May 11 2026 8:36 AM

Undavalli Farmers Big Shock to Cm Chandrababu Over Second Phase of Land Pooling for Capital

ఉండవల్లిలో రాజధాని రైతుల తీర్మానం 

రాజధానికి రైతులెవరూ వ్యతిరేకం కాదు  

అయితే ప్రభుత్వం తన స్వార్థం కోసం రైతుల మధ్య చిచ్చుపెడుతోంది 

వర్గాల వారీగా విడగొట్టి దౌర్జన్యం చేస్తోంది 

ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం తగదు 

అందుకే భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నాం 

ఈ నెల 20న సభకు అందరూ తరలిరావాలని పిలుపు

తాడేపల్లి రూరల్‌ : చంద్రబాబు ప్రభుత్వం తమకు తీరని ద్రోహం చేస్తోందని రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. రెండో విడత భూ సమీకరణ కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతోందని, వర్గాలుగా విడదీసి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరితో తొలుత భూములు తీసుకుని, అందరూ ఇవ్వాల్సిందేనని దౌర్జన్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరు ఎంత మాత్రం సబబు కాదని, అందుకే తామంతా ఒకతాటిపైకి వచ్చి భూ సమీకర­ణను వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అందరం కలిసికట్టుగా భూసమీకర­ణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణ చేస్తున్న క్రమంలో ఆదివారం రాజధాని ప్రాంత రైతులు ఉండవల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఈశ్వరరెడ్డి, జొన్నా శ్రీనివాస­రావు, గంటు బాలాజీ, పెద్దిశెట్టి వీరస్వామి, శ్రీనివాసరావు, అంజిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నాగరాజు, శివకోటేశ్వరరావు, అశోక్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ‘మా తాత ముత్తాతల నుంచి ఈ భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం రైతులను వర్గాల వారీగా విడదీసి, తన స్వార్థ ప్రయోజనాల కోసం మన మధ్య విభేదాలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రైతు రైతే. రైతుకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే పోరాటం చేసి సాధించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే ప్రాంతంలో 2015–2019 మధ్య రైతులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు న్యాయస్థానా­లను ఆశ్రయించి విజయం సాధించాం’ అన్నారు. 

అవసరానికి మించి భూమి ఎందుకు?
మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అవసరాలకు మించి భూమిని రైతుల దగ్గర నుండి తీసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని రైతులు తెలిపారు. ఇందులో భాగంగా విడతల వారీగా భూ సమీకరణకు నోటీసులు ఇస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఈ ప్రక్రియ ప్రారంభిస్తే ఇబ్బంది అని, విడతల వారీగా ఈ ప్రక్రియ చేపట్టిందన్నారు. ‘రాజధానికి రైతులు ఎవరూ వ్యతిరేకం కాదు. అవసరమైన మేర భూములు తీసుకుంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. వారు దోపిడీ చేసిన దాంట్లో పాతిక వంతు ఖర్చు పెట్టినా ప్రభుత్వ అవసరాలను అవసరమైన భూమిని రైతుల దగ్గర నుండి నేరుగా కొనుగోలు చేయొచ్చు.

కనీసం సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేయలేదు. రైతులకు ఇచ్చిన హామీలు  అమలు చేయడంలోనూ వైఫల్యం చెందింది. ఇలాంటప్పుడు రైతులు ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలో ఆలోచించాలి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలువురు రైతులు తమ భూములను వారి ఆడపిల్లకు కట్నాలుగా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీరుతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసమైనా మనం స్పందించాలి. ఈ నెల 20వ తేదీన ఉండవల్లిలో నిర్వహించే సభకు ప్రతి ఒక్కరు హాజరై భూ సమీకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను చెప్పాలి. ఆ తర్వాత ఆ అభిప్రాయాలను అర్జీల రూపంలో అధికారులకు, ప్రభుత్వానికి అందజేద్దాం’ అని రైతులు తీర్మానించారు. తమ పోరాటానికి సీపీఎం, వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీల మద్దతు కోరుతూ ముందుకు వెళదామని రైతులు నిర్ణయించారు.  

Advertisement
 
Advertisement
Advertisement