విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్‌ విక్రయాలు | Uncontrolled sales of antibiotics | Sakshi
Sakshi News home page

విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్‌ విక్రయాలు

Jun 10 2025 4:52 AM | Updated on Jun 10 2025 4:52 AM

Uncontrolled sales of antibiotics

మెడికల్‌ స్టోర్స్‌పై కొరవడిన పర్యవేక్షణ వైద్యుల  

ప్రిస్కిప్షన్‌ లేకుండానే అమ్మకాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెడికల్‌ స్టోర్స్‌ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లాభాపేక్షతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైద్యుల  ప్రిస్కిప్షన్‌ లేకుండానే విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్‌ విక్రయాలు చేపడుతున్నారు. అవగాహన లేమితో దగ్గు, జలుబు, జ్వరం, నొప్పుల వంటి చిన్న అనారోగ్య సమస్యలతో మెడికల్‌ స్టోర్స్‌ను సంప్రదిస్తున్న వారికి అవసరం లేకున్నా యాంటిబయోటిక్స్‌ని కట్టబెడుతున్నారు.

వీటి అతి వినియోగం ప్రజారోగ్యానికి పెను విపత్తుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. వీటిని అతిగా వినియోగించడంతో యాంటి మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) సంభవించి, ప్రాణాంతక వ్యాధుల బారినపడిన సమయంలో మందులు పనిచేయని దుస్థితి నెలకొంటోంది.  

నిబంధనలు బేఖాతర్‌ 
రాష్ట్రంలో 42 వేల హోల్‌సేల్, రిటైల్‌ మందుల దుకాణాలు ఉన్నాయి. డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ చట్టం 1945లోని షెడ్యూల్‌ హెచ్, హెచ్‌ 1లో ఉండే మందులను మెడికల్‌ స్టోర్స్‌లో వైద్యుడి ప్రిస్కిప్షన్‌ లేకుండా విక్రయించకూడదు. ఈ మందుల్లో యాంటిబయోటిక్‌ మందులు కూడా ఉంటాయి. అయితే నిబంధనలను చాలా వరకూ స్టోర్స్‌ యజమానులు బేఖాతరు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.  

అవగాహనా కార్యక్రమాలేవి? 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజారో­గ్యా­నికి విపత్తుగా మా­రిన ఏఎంఆర్‌ నియంత్రణ దిశగా అడుగులు వే­శారు. ప్ర­త్యేక కార్యాచరణను ప్ర­భుత్వం అప్పట్లో ప్రకటించింది.  వైద్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, ఇతర శాఖలను సమన్వయ పరుచుకుంటూ ఏఎంఆర్‌ నియంత్రణకు ప్రణాళిక రచించారు. ప­లు సంస్థలతో వైద్య శాఖ ఎంవోయూలు చేసుకుంది.  కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయా చర్యలు నీరుగారిపోయాయి. 

ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఏఎంఆర్‌ కారణంగా దాదాపు యాభై లక్షల మంది మరణిస్తున్నారని పలు అధ్యయనాలు  వెల్లడించాయి. 2050 నాటికి ఏఎంఆర్‌ కారణంగా మృత్యువాత పడేవారి సంఖ్య కోటికి చేరే అవకాశం ఉందని అంచనా. ప్రపంచం ఎదుర్కొంటున్న తొలి పది ఆరోగ్య సంక్షోభాల్లో ఏఎంఆర్‌ ఒకటని డబ్ల్యూహెచ్‌వో సైతం స్పష్టం చేస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement