చెరువులో చేపల మేత వేస్తూ.. 

Two people deceased in boat sinking at Andhra Pradesh - Sakshi

పడవ మునిగి ఇద్దరు మృతి

ఒకరు ఒంగోలు వాసి 

ఎన్టీఆర్‌ జిల్లాలో ఘటన  

జగ్గయ్యపేట: చేపల చెరువులో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆధ్వర్యంలో సాగవుతున్న చేపల చెరువు రక్షణకు ఒంగోలుకు చెందిన మేడా వెంకట్రావ్‌ (27), భార్య, ఇద్దరు పిల్లలతో కాపలాదారునిగా ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్న సమయంలో అదే గ్రామానికి చెందిన వల్లెపు ప్రవీణ్‌ (22) కూలీ పనుల్లో భాగంగా చెరువు వద్దకు వెళ్లాడు.

కాపలాదారు వెంకట్రావ్, ప్రవీణ్‌ చేపలకు మేత వేసేందుకు ఒడ్డునున్న ఇనుప రేకు పడవతో చెరువులోకి వెళ్లి మేత వేస్తుండగా..  ఒక్కసారిగా పడవ మునిగిపోయింది. దీంతో ఒడ్డున ఉన్న భార్యా, పిల్లలు  కేకలు వేయడంతో సమీపంలోని పంట పొలాల్లో ఉన్న కూలీలు పరుగున వచ్చారు. చెరువులో పైకి తేలిన వెంకట్రావ్‌ను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

అప్పటికి ప్రవీణ్‌ ఆచూకీ లభించలేదు. చిల్లకల్లు ఎస్‌ఐ చిన్నబాబు సిబ్బందితో వచ్చి ప్రవీణ్‌ కోసం గాలించగా.. మృతదేహం లభ్యమైంది. ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, వెంకట్రావు తండ్రి ఇదే చెరువుకు కాపలాదారుడిగా ఉంటూ గతేడాది గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో వెంకట్రావ్‌ ఏడాదిగా చెరువుకు కాపలాదారుడిగా ఉంటున్నాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top