AP: ఖతార్‌ నుంచి ఇద్దరు మహిళలకు విముక్తి

Two AP Women Safely Return To India From Qatar Over Fraud Jail Case - Sakshi

తప్పుడు కేసుతో జైలు పాలైన బాధితులకు ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అండ

క్షేమంగా స్వస్థలాలకు పంపించిన ప్రతినిధులు

సాక్షి, కడప: ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) చొరవతో ఇద్దరు మహిళలు ఖతార్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ వివరాలను ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ డైరెక్టర్‌ బీహెచ్‌ ఇలియాస్‌ సోమవారం మీడియాకు తెలియజేశారు. వైఎస్సార్‌ జిల్లా కడపలోని అక్కాయపల్లెకు చెందిన కాకిరేని గంగాదేవి, తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలానికి చెందిన గంగాభవానీ గృహ కార్మికులుగా గతేడాది ఖతార్‌కు వెళ్లారు. అక్కడ స్పాన్సర్‌(సేఠ్‌) వీరిని వేధింపులకు గురిచేశాడు. దీంతో వారిద్దరూ.. తమను భారత్‌కు పంపించాలని అతన్ని వేడుకున్నారు.

అయినా కనికరించని అతను.. వీరిద్దరిపై దొంగతనం కేసు పెట్టి జైలుపాలు చేశాడు. ఈ విషయం ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ కో–ఆర్డినేటర్‌ మనీష్‌ దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే ఖతార్‌ జ్యుడిషియల్‌ను సంప్రదించారు. గంగాదేవి, గంగాభవానీపై అన్యాయంగా దొంగతనం కేసు బనాయించారని, వారిని భారత్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఖతార్‌ జ్యుడిషియల్‌ దీనిని విచారించి.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

భారత్‌కు పంపించాలని ఆదేశించింది. ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులు మనీష్, రజనీమూర్తి భారత రాయబార అధికారులతో మాట్లాడి తాత్కాలిక పాస్‌పోర్టు, టికెట్‌ ఇప్పించి వారిని ఈ నెల 25న స్వదేశానికి రప్పించారు. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ఖాతార్‌ తెలుగు కళా సమితి జనరల్‌ సెక్రటరీ దుర్గాభవాని ఆర్థిక సాయం చేశారు. బాధిత మహిళలు గంగాదేవి, గంగాభవానీ మాట్లాడుతూ.. ఖతార్‌లో ఇబ్బందులు పడుతున్న తమను గుర్తించి.. ఆదుకున్న ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top