తిరుమలలో ఇతర చానళ్ల ప్రసారాల బాధ్యులపై టీటీడీ చర్యలు | Sakshi
Sakshi News home page

తిరుమలలో ఇతర చానళ్ల ప్రసారాల బాధ్యులపై టీటీడీ చర్యలు

Published Tue, Apr 26 2022 7:50 AM

TTD Suspends Assistant Technician And Gives Show Cause Notice Tirupati - Sakshi

తిరుమల: తిరుమలలోని ఎస్వీబీసీకి చెందిన ఐదు ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5.12 నుంచి 6.12 గంటల వరకు 3 ఇతర చానళ్ల కార్యక్రమాలు ప్రసారమైన ఘటనకు బాధ్యుడైన గ్రేడ్‌–1 అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ పి.రవికుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. రేడియో అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఎ.వి.వి.కృష్ణప్రసాద్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

తిరుమలలో ఎస్వీబీసీకి చెందిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ఇతర చానళ్ల కార్యక్రమాలు ప్రసారమైన ఘటనపై టీటీడీ ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి వెనువెంటనే స్పందించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీవీఎస్వో నరసింహకిషోర్‌ను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపారు. ఘటన జరిగిన సమయంలో అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ పి.రవికుమార్‌ కర్నూలుకు చెందిన తన స్నేహితుడు గోపికృష్ణతో కలిసి బ్రాడ్‌ కాస్టింగ్‌ టీవీ సెక్షన్‌ కంట్రోల్‌ రూంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు.

కొంత సమయం తరువాత రవికుమార్‌తో పాటు అక్కడి ఉద్యోగులు అందరూ బయటకి రాగా, సాయంత్రం 5.28 గంటల వరకు గోపికృష్ణ మాత్రమే కంట్రోల్‌ రూంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు విచారణలో నిర్థారణ అయింది. ఈ మేరకు పి.రవికుమార్‌ను సస్పెండ్‌ చేయగా, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఎ.వి.వి.కృష్ణ ప్రసాద్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.
ఈ వార్త కూడా చదవండి: విశాఖలో ఏపీఈఆర్‌సీ క్యాంపు కార్యాలయం!

Advertisement
Advertisement