పురోహితుడు లేని పెళ్లి | Tribal peoples Marriage In West Godavari | Sakshi
Sakshi News home page

పురోహితుడు లేని పెళ్లి

Sep 16 2026 2:05 PM | Updated on Sep 16 2026 2:51 PM

Tribal peoples Marriage In West Godavari

వధూవరులను మోసుకు వెళ్తున్న దృశ్యం

బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి తల్లి ఒడిలో నిత్యం సేదతీరే గిరిజనుల సాంప్రదాయాలు ఎంతో విశిష్టంగా, సహజంగా ఉంటాయి. ముఖ్యంగా కొండరెడ్డి తెగ వివాహాల్లో పురోహితులు ఉండరు. వేద మంత్రాలూ వినిపించవు. ఆర్భాటపు బాజా భజంత్రీలు, బంధువుల హడావిడి అస్సలు ఉండవు. పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా వధువు మెడలో వరుడు నల్లపూసల తాడు కడితే చాలు... ఆ వివాహ బంధం జీవితాంతం నిలిచిపోతుంది. పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్న ఈ నిరాడంబర వివాహ వ్యవస్థ గురించి కొండరెడ్డి గిరిజనులు పంచుకున్న వివరాలు ఇవీ.. - ఏలూరు 

మేనరికాలకే తొలి ప్రాధాన్యం 
కొండరెడ్డి గిరిజనులు వివాహాల్లో మేనరికాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం మేనరికపు పెళ్లిళ్ల వల్ల పిల్లల్లో లోపాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ, తమ తెగలో అలాంటి సమస్యలు చాలా అరుదని (కేవలం ఒక శాతంలోనే) వీరు అంటారు. వధువు, వరుడు పరస్పరం ఇష్టపడ్డాక, వరుడిని వధువు ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ ఇరువర్గాల బంధువులు, గ్రామ పెద్దల సమక్షంలో పెళ్లి ప్రకటన చేసి, వరుడికి నల్లపూసల తాడును అందిస్తారు. అతడు దానిని వధువు మెడలో వేయగానే, అందరి చప్పట్ల మధ్య వివాహ తంతు ముగుస్తుంది. 

కట్నకానుకలు, ఆర్భాటాలకు తావులేదు 
ఈనాటి వివాహాలు లక్షలాది రూపాయల ఖర్చుతో, వ్యాపారాత్మకంగా మారిపోయాయి. కానీ కొండరెడ్డి గిరిజనుల ఆచారంలో కట్నకానుకల ప్రస్తావనే ఉండదు. వరుడే వధువు ఇంటికి వచ్చి వివాహం చేసుకుంటాడు. బంగారపు తాళి»ొట్టుకు బదులు కేవలం నల్లపూసల తాడునే ఉపయోగిస్తారు. డీజేలు, అలంకరణలు, పూజారుల ఖర్చులు వంటివేవీ వీటిల్లో ఉండవు. 

ఇప్పసారా విందు... డోలు కొయ్యల నృత్యాలు 
వీరి వివాహ వేడుకలు సాధారణంగా రాత్రి వేళల్లో జరుగుతాయి. పెళ్లి విందు కూడా ఎంతో ప్రత్యేకమైనది. అడవిలో లభించే ఇప్పపువ్వులతో తయారు చేసిన ఇప్పసారా, ఇప్ప చిగురుతో వంటకాలు తయారు చేసి విందు ఆరగిస్తారు. వివాహ సమయంలోనూ, విందు సమయంలోనూ వారి సాంప్రదాయ ‘డోలు కొయ్యల’ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా గడుపుతారు.

విశిష్టమైన ఆచారాలు 
సాధారణ పెళ్లిళ్లలో వధూవరులకు కానుకలు ఇవ్వడం సహజం. కానీ కొండరెడ్డి గిరిజనుల్లో వధూవరులు ఇంట్లోకి వెళ్లే సమయంలో గ్రామ పెద్దలు, పేరంటాళ్లు, వరుడి వైపు పెద్దలు రూ.20 నుంచి రూ.100 వరకు కానుకగా ఇస్తారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు వధూవరులు నడిచే మార్గంలో పడుకుంటారు. కానుకలు ఇచ్చిన తర్వాతే వారు పైకి లేస్తారు. మండపం నుంచి ఇంటికి వెళ్లేవరకు ఇలా ఐదుసార్లు జరుగుతుంది. సాంప్రదాయ పాటలు పాడే పేరంటాళ్లకు కూడా రూ.20 నుండి రూ.50 వరకు కానుకలు అందిస్తారు. అలాగే పెళ్లి సమయాల్లో ఊరి చివర వాగులు ఎదురైతే, వధూవరులను గ్రామస్తులు భుజాలపై ఎత్తుకుని వాగు దాటిస్తారు.

మేనరికాలే ఎక్కువ 
మా కొండరెడ్ల సంస్కృతిలో ఎక్కువగా మేనరికపు పెళ్లిళ్లే జరుగుతాయి. కట్నకానుకలు, పురోహితులు, మేళతాళాల ఆర్భాటం ఉండదు. వరుడు వధువు మెడలో నల్లపూసల తాడు వేస్తే పెళ్లయిపోయినట్లే. మేనరికం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు. ఎక్కడో ఒక శాతం మాత్రమే సమస్యలు కనిపిస్తాయి. 
– వేట్ల రాజారెడ్డి, కొయిదా ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ, బుట్టాయగూడెం  

సనాతన సాంప్రదాయం
అబ్బాయి, అమ్మాయి ఇష్టపడిన తర్వాత ఇరువైపుల పెద్దలు, గ్రామస్థులు ఒకచోట చేరి వివాహ ప్రకటన చేస్తారు. నల్లపూసల తాడు మెడలో పడటమే ఏడేడు జన్మల బంధంగా భావిస్తాం. మా ఆచారంలో నిరాడంబరత, పవిత్రత ఉన్నాయి. ఇది తరతరాలుగా వస్తున్న సనాతన సాంప్రదాయం. 
– కెచ్చెల చిన్నంరెడ్డి, రేగులపాడు, బుట్టాయగూడెం మండలం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement