వాటర్‌ చాంపియన్‌గా పారేశమ్మ

Thamballapalle Woman Bags National Women Water Champion Award - Sakshi

బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): భూగర్భ జలాల స్థితి ఆధారంగా పంటల సాగు ద్వారా రైతులు సత్ఫలితాలు సాధించేలా కృషి చేసిన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చెందిన టి.పారేశమ్మ జాతీయ ఉమెన్‌ వాటర్‌ చాంపియన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌డీపీ), జాతీయ వాటర్‌ మిషన్‌ బుధవారం ఢిల్లీ నుంచి వెబినార్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి 63 మందిని అవార్డుల కోసం ప్రతిపాదించగా.. అందులో ఏపీకి చెందిన పారేశమ్మ సహా 41 మందికి అవార్డులు దక్కాయి.  


           పంటల గురించి పొలంలో రైతులతో సమావేశమైన పారేశమ్మ (ఫైల్‌)  

రీసోర్స్‌ పర్సన్‌గా.. రైతులకు అండగా.. 
చిత్తూరు జిల్లాలోని గొపిదిన్నెకు చెందిన పారేశమ్మ కుటుంబం తంబళ్లపల్లెకు వచ్చి స్థిరపడింది. ఐటీఐ చదివిన పారేశమ్మ.. 2015 నుంచి గుజరాత్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎకోలాజికల్‌ సెక్యూరిటీ (ఎఫ్‌ఈఎస్‌) సంస్థలో రిసోర్స్‌ పర్సన్‌గా పనిచేస్తున్నారు. తంబళ్లపల్లె పరిధిలోని 16 పల్లెల్లో విధులు నిర్వర్తిస్తూ.. అక్కడి వారితో సంఘాలు ఏర్పాటు చేశారు. పంటల సాగు, వనరుల సంరక్షణ గురించి ఈ సంఘాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తుంటారు. 

ఏఏ పంటలకు ఎంత నీరు అవసరం అవుతుంది?  నీటివనరుల పరిస్థితి ఏంటి? భూగర్భ జలాల స్థితిని అంచనా వేసి.. ఏయే పంటలు సాగు చేయాలో రైతులకు తెలియజేసేవారు. భూగర్భ జలాల ఆధారంగా రైతుకున్న పొలంలోని సగ భాగంలో ఏదైనా పంట వేసేలా.. మిగిలిన సగంలో చిరుధాన్యాల సాగు చేసేలా ప్రోత్సహించేవారు. పారేశమ్మ కృషి వల్ల స్థానిక రైతుల్లో మార్పు వచ్చింది. పారేశమ్మ ఏర్పాటు చేసిన సంఘాల సూచనలను పాటించి రైతులు సత్ఫలితాలు పొందడం మొదలుపెట్టారు. 

సంతోషంగా ఉంది..
అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచింది. వ్యవసాయం, సహజ వనరుల సంరక్షణ కోసం గ్రామస్తులతో కలిసి మరింత కృషి చేస్తా. 
– టి.పారేశమ్మ, ఎఫ్‌ఈఎస్‌ రీసోర్స్‌ పర్సన్, తంబళ్లపల్లె 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top