బీసీ గురుకులాల్లో సర్కారు ద్వంద్వనీతిపై ఉపాధ్యాయుల మండిపాటు
ఉత్తీర్ణత తగ్గినచోట టీచర్లకు షోకాజ్ నోటీసులు, గెస్ట్ ఫ్యాకల్టీ తొలగింపు
ఉత్తీర్ణత పెరిగిన స్కూళ్లలో టీచర్లను మాత్రం గుర్తించని ప్రభుత్వం
105 బీసీ గురుకులాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించినవి 32
ఆ 32 గురుకులాల ప్రిన్సిపాల్స్‌కు విజయవాడలో మంత్రి సత్కారం
సాక్షి, అమరావతి: విద్యార్థులకు మార్కులు తగ్గితే టీచర్లకు షోకాజ్ నోటీసులు.. అదే ఉత్తీర్ణత శాతం పెరిగితే ప్రిన్సిపాల్స్‌కు సత్కారాలు.. చంద్రబాబు సర్కారుకు ఇదేం ద్వంద్వనీతి అంటూ బీసీ గురుకులాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ పరి«ధిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఉత్తీర్ణతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు ప్రిన్సిపాల్స్‌ను మంగళవారం విజయవాడలో సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి సత్కరించడం వరకు సరే.. ప్రిన్సిపాల్స్‌ను, జిల్లా బీసీ సంక్షేమ అధికారులను జ్ఞాపికలతో అభినందించడాన్ని బీసీ గురుకుల టీచర్లు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు ముందు ప్రభుత్వం చేసిన హడావుడిని వారు గుర్తుచేస్తున్నారు.
బీసీ గురుకులాల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే సంబంధిత టీచర్లకు షోకాజ్ నోటీçసులు ఇస్తామని, ఉత్తీర్ణత శాతం తగ్గితే విధుల నుంచి తొలగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత నుంచి గురుకులాల కార్యదర్శి మాధవీలత వరకు సమీక్ష సమావేశాల్లో హెచ్చరించారు. పరీక్ష ఫలితాలు వచ్చాక ఉత్తీర్ణత తక్కువ నమోదైన గురుకులాల్లో సంబంధిత సబ్జెక్ట్ టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తక్కువ ఉత్తీర్ణత ఉన్న గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీలను విధుల నుంచి తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఉత్తీర్ణత బాగున్న గురుకులాల్లో మాత్రం సంబంధిత టీచర్లను గుర్తించి అభినందించకపోగా.. ఆ మొత్తం ఘనత ప్రిన్సిపాల్స్‌దే అన్నట్లు వారిని సత్కరించడాన్ని టీచర్లు తప్పుబడుతున్నారు.
రాష్ట్రంలోని 105 బీసీ గురుకులాలకుగాను 32 గురుకులాల్లో మాత్రమే నూరుశాతం ఉత్తీర్ణత వచ్చింది. ఆ 32 గురుకులాల ప్రిన్సిపాల్స్‌ను పిలిచి అభినందించిన కార్యక్రమానికి తమను కూడా పిలిచి తమ కృషిని గుర్తించి ఉంటే బాగుండేదని టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మార్కులు తగ్గినా, ఉత్తీర్ణత లేకపోయినా టీచర్ బాధ్యుడని, మంచి ఫలితాలు సాధిస్తే ప్రిన్సిపాల్ ఘనత అని ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శించడం సరికాదని గురుకులాల్లో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్, గెస్ట్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.


