అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో సాక్షులకు టీడీపీ బెదిరింపులు

Tdp Threatening Witnesses Amaravati Assigned Lands Case - Sakshi

వాటిని కోర్టు దృష్టికి తేవడానికి సిద్ధమవుతున్న సాక్షులు

నాడు చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే జీవో 41 జారీ

దాంతోనే రూ.4వేల కోట్ల అసైన్డ్‌ భూమి కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు

అమరావతిలోని బడుగు వర్గాలను బెదిరించి 964 ఎకరాలు స్వాహా

ఆ తర్వాత అసైన్డ్‌ భూములకూ భూసమీకరణ ప్యాకేజీ ఇస్తూ జీవో

ఇది నిబంధనలకు విరుద్ధమని మొత్తుకున్న ఉన్నతాధికారులు..

అయినా వినని అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ

సీఐడీ దర్యాప్తులో వాంగ్మూలం ఇచ్చిన కీలక అధికారులు

నిబంధనలకు విరుద్ధంగా వాంగ్మూలం ప్రతులు సంపాదించిన టీడీపీ

అప్పటి నుంచి సాక్షులపై ఒత్తిళ్లు, బెదిరింపులు

సాక్షి, అమరావతి:  ఇంటి గుట్టు రట్టు లంకకు చేటు తెచ్చిందని ఆనాడు రావణుడు నేలకొరుగుతూ వాపోయాడు.  అమరావతి భూదందా గుట్టు రట్టవడం టీడీపీకి చేటు అంటూ ఇప్పుడు చంద్రబాబు చుర్రుబుర్రులాడుతున్నారు. అమరావతిలో రూ.4,000 కోట్ల అసైన్డ్‌ భూములు కొల్లగొట్టిన దందా బట్టబయలు కావడంతో సీఐడీ కేసులు నమోదు చేసింది. టీడీపీ నేతలు ఆ భూములు ఎలా కొల్లగొట్టారో కొందరు సాక్షులు సీఐడీకి వివరంగా చెప్పడంతో చంద్రబాబు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసులో సాక్షుల వాంగ్మూలం కాపీలు దక్కించుకోవడమే కాకుండా .. వాటి ఆధారంగా సాక్షులను బెదిరిస్తున్నారు. 

చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే అసైన్డ్‌ జీవో 
అమరావతిలో అసైన్డ్‌ భూములు కొల్లగొట్టిన పచ్చ గద్దల కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు పలువురు ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులను విచారించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు, వారి బినామీలు అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్‌ భూములు కొల్లగొట్టిన వైనంపై  ప్రధానంగా దృష్టిసారించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఏకంగా 964 ఎకరాలను అసైన్డ్‌ భూముల చట్టానికి విరుద్ధంగా హస్తగతం చేసుకున్నారు. ఆ తరువాత అసైన్డ్‌ భూములకు కూడా భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. దాంతో ఏకంగా రూ. 4 వేల కోట్ల విలువైన 964 ఎకరాలు చంద్రబాబు బినామీలు, అస్మదీయుల గుప్పిట్లోకి చేరాయి.

అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఆనాటి ఉన్నతాధికారులు ఎంతగా చెప్పినా,  అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ససేమిరా అన్నారు. వారిద్దరి ఒత్తిడితోనే ఉన్నతాధికారులు జీవో 41 జారీ చేశారు. ఇదే విషయాన్ని ఆ ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులు సీఐడీ దర్యాప్తులో వెల్లడించారు. ఈ మేరకు సెక్షన్‌ 164 కింద వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. దాంతో చంద్రబాబు సాగించిన భూదందా అధికారికంగా బట్టబయలైంది. ఈ కేసు విచారణ న్యాయస్థానంలో కొనసాగుతోంది. 

టీడీపీ చేతిలో వాంగ్మూలం కాపీలు.. సాక్షులపై ఒత్తిళ్లు 
రోజురోజుకు వ్యవహారం ప్రతికూలంగా మారుతుండటంతో అసైన్డ్‌ భూముల కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు అండ్‌ కో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ కేసులో సాక్షులను లక్ష్యంగా చేసుకున్నారు. సీఐడీకి సాక్షులు సెక్షన్‌ 164 కింద ఇచ్చిన వాంగ్మూలం ప్రతులను నిబంధనలకు విరుద్ధంగా సంపాదించారు. వీటిలో సాక్షులు వెల్లడించిన వాస్తవాలతో చంద్రబాబు బ్యాచ్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి.

దాంతో సాక్షులపై ఒత్తిళ్లు, పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘మనం మనం’ ఒకటి కదా అంటూ బతిమాలుతూనే, బెదిరింపులకూ పాల్పడుతున్నట్లు సమాచారం. తమ వర్గాల ద్వారా వేర్వేరు మార్గాల్లో ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. దాంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము ఇచ్చిన వాంగ్మూలం కాపీలు టీడీపీ చేతుల్లోకి పోవడంతో అసైన్డ్‌ భూముల కేసులో కీలక సాక్షులు ఆందోళన చెందుతున్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం.
చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్‌ వన్‌.. ఇదీ మన ఘనత

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top