రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతతో నిందితురాలు రంగమ్మ (ఫైల్)
పోలీసుల విచారణలో కీలక అంశాలను వెల్లడించిన లేడీడాన్ రంగమ్మ
పలువురు టీడీపీ నేతలకు భారీగా వాటాలు.. మొత్తం నాలుగు ముఠాలు
ఇద్దరు ఉరవకొండ నేతలకు ఈ ముఠాతో సంబంధాలు
ధర్మవరం చేనేత వ్యాపారి నుంచి రూ.కోటికి పైగా వసూలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అనంత’ హనీట్రాప్ గలీజు దందా మొత్తం పచ్చముఠా ఆధ్వర్యంలోనే జరిగినట్లు తేలింది. పోలీసులు రిమాండ్‌కు పంపిన వారిలో ముగ్గురు టీడీపీ నేతలు ఉండగా ఆ పార్టీ నేతలకు భారీగా వాటాలు అందినట్లు తెలుస్తోంది. హనీట్రాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నిందితురాలు, లేడీడాన్ రంగమ్మ రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు సన్నిహితురాలు కావడం గమనార్హం. డాన్ రంగమ్మను పోలీసులు రిమాండ్ నుంచి కస్టడీలోకి తీసుకుని కీలక వ్యక్తుల పాత్ర, బ్యాంకు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.
విచారణలో రంగమ్మ కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి అమాయకులను పరువు పేరుతో భయపెట్టి ప్రామిసరీ నోట్లు రాయించుకుని రూ.కోట్లలో దోపిడీ చేసిన ‘అనంత’ హనీట్రాప్ దందాను పోలీసులు ఛేదిస్తున్నారు. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్న 9 మంది పోలీసులపై వేటు వేశారు. వీరిలో ముగ్గురు సీఐలు, ఎస్‌ఐ, ఏఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ స్థాయిలో పోలీసులపై వేటు పడటం ‘అనంత’ పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. మరి కొందరి పాత్రపై కూపీ లాగుతున్నారు. ఈ ముఠాకు సహకరించిన వారు, బ్యాంకు లావాదేవీలు జరిపిన వారిని విచారించి చర్యలు తీసుకోనున్నారు. కాల్‌డేటా ఆధారంగా ఆడియో రికార్డులు సేకరించి విచారణ చేస్తున్నారు.
నాలుగు ముఠాలు..
హనీట్రాప్ వ్యవహారంలో మరో ఇద్దరు నిందితులు రాజేశ్, నరేంద్రరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు. మరో నిందితురాలు చంద్రకళ మంత్రి సత్యకుమార్‌కు అత్యంత సన్నిహితురాలు. మొత్తం నాలుగు ముఠాలు ‘అనంత’లో దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ధర్మవరంలో ఓ చేనేత వ్యాపారి నుంచి రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. దీన్నిబట్టి దందా ఏ స్థాయిలో సాగిందో స్పష్టమవుతోంది. నాలుగు ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో దందా బహిర్గతమైంది. కాగా ఉదయభాస్కర్‌రెడ్డిని బాధితుడిగా పేర్కొని కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు అతడిని కూడా నిందితుడిగా చేర్చి రిమాండ్‌కు పంపారు.
ఇద్దరు ఉరవకొండ టీడీపీ నేతలు..!
ఈ ముఠా సభ్యులతో సంబంధాలున్న వారిలో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలున్నారు. వీరిలో ఒకరు టీడీపీ జిల్లా కమిటీలో కీలక పోస్టులో కొనసాగుతుండగా మరొకరు రంగమ్మకు సన్నిహితుడు. హనీట్రాప్ బాధితులు కేసు నమోదు కోసం కూడేరు సీఐను ఆశ్రయించగా అదే మండలానికి చెందిన టీడీపీ నేత అడ్డుపడినట్లు తెలుస్తోంది. ‘అనంత’కు చెందిన ఓ బీజేపీ నేత ఈ వ్యవహారంపై నిత్యం పోలీసుస్టేషన్లలో పంచాయితీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. రంగమ్మ ఖాతా నుంచి ఆయన ఖాతాకు రూ.15 లక్షలు బదిలీ అయినట్లు తెలిసింది.
‘అనంత’ హనీట్రాప్‌పై ‘సాక్షి’ ఈ నెల 19 నుంచి వరుస కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో డీఐజీ షిమోíÙ, ఎస్పీ జగదీశ్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ట్రైనీ ఎస్పీ అశ్విన్ మణిదీప్, ఎస్పీ జగదీశ్ కేసును పరిశోధిస్తున్నారు. వారం రోజుల్లోనే 8 మందిని రిమాండ్‌కు పంపడంతో పాటు 9 మంది పోలీసులపై వేటు వేశారు.


