
చికిత్స పొందుతున్న మాధవి
మతి స్థిమితం కోల్పోయిన బాధితురాలు
అప్పు తీర్చమన్నందుకు ఘాతుకం
ఎన్టీఆర్ జిల్లా గుర్రాజుపాలెంలో ఘటన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వమని అడిగిన మహిళను ఇంటిముందు షెడ్డులో బంధించి టీడీపీ నేతలు చితక్కొట్టిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం గుర్రాజుపాలెంలో జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ మతిస్థిమితం కోల్పోయింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చిన్ననందిగామకు చెందిన మద్దాల మాధవి రెండేళ్ల క్రితం గుర్రాజుపాలెంకు చెందిన తండ్రీకొడుకులైన టీడీపీ నేతలు వరికూటి రాము, పవన్‌లకు రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చింది.
ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఈనెల 14న మాధవి టీడీపీ నేత వరికూటి రాముకు ఫోన్‌చేసి అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో రాము ‘నీకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. నీకు చేతనైంది చేసుకో’ అనడంతో మాధవి తన కుమారుడు భువనేంద్రతో కలిసి గుర్రాజుపాలెంలోని రాము ఇంటికి వెళ్లింది. డబ్బుల కోసం మా ఇంటకే వస్తావా అంటూ మాధవిపై టీడీపీ నేత వరికూటి రాము, ఆయన కుమారుడు పవన్ దాడి చేశారు. ఆ వెంటనే రాము తమ్ముడు సుబ్బారావు, ఆయన కుమారులు శ్రీను, తేజ అక్కడికి చేరుకుని మాధవిని ఇంటిముందు ఉన్న రేకుల షెడ్డులో తాడుతో కట్టేసి విచక్షణా రహితంగా దాడి చేశారు.
అడ్డువచ్చిన మాధవి కుమారుడు భువనేంద్రను సైతం కొట్టి నెట్టడంతో పక్కకి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకున్న భువనేంద్ర బంధువులకు ఫోన్ చేయడంతో వారంతా గుర్రాజుపాలెంలోని టీడీపీ నేత రాము ఇంటికి వెళ్లారు. బంధువుల సాయంతో తల్లి మాధవిని విడిపించుకుని మైలవరంలోని ప్రైవేటు ఆసుపత్రి తరలించాడు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. టీడీపీ నేతల దెబ్బలకు మతిస్థిమితం కోల్పోయిన మాధవి ఎవరినీ గుర్తు పట్టలేని స్థితికి చేరిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
బాధితులపైనా కేసు
టీడీపీ నేతల దాడిలో గాయపడిన మాధవి, ఆమె కుమారుడు భువనేంద్రతో పాటు వారికి సాయం చేయడానికి వచ్చిన బంధువులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన టీడీపీ నేతలు తమపై కేసు నమోదైనట్టు తెలుసుకుని శనివారం జి.కొండూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నానా హంగామా సృష్టించినట్టు తెలిసింది.
తమపై కేసులు నమోదు చేయడమేంటని, తమ ఇంటికి వచ్చి గొడవ చేసిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులపై ఒత్తిడి తెచి్చనట్టు సమాచారం. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు బాధిత మహిళ మాధవి, ఆమె కుమారుడు భువనేంద్ర, వారికి సాయంగా వచి్చన బంధవులపై కూడా కేసు నమోదు చేశారు.