సర్వే చేయడానికి మీరు ఎవర్రా..? | TDP Leaders Attack on Officials: Andhra pradesh | Sakshi
Sakshi News home page

సర్వే చేయడానికి మీరు ఎవర్రా..?

May 31 2026 5:44 AM | Updated on May 31 2026 5:44 AM

TDP Leaders Attack on Officials: Andhra pradesh

సర్వేను అడ్డుకోడానికి టీడీపీ కండువాతో వచ్చిన అశ్వర్థమ్మ

అధికారులపై టీడీపీ నాయకుల దాడి 

కింద పడిపోయిన సర్వేయర్‌ 

ఇరువురు ఎస్‌ఐల చొక్కాలు చిరిగేలా తోపులాట 

సిబ్బంది అప్రమత్తతతో బయటపడ్డ డిప్యూటీ తహసీల్దార్‌ 

అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతల దాష్టికం

శెట్టూరు: మేము అధికార పార్టీ నాయకులం... పోలీ­సులు, అధికారులు ఎవరైనా లెక్కలేదు అన్న­ట్లు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరికి అద్దం పడుతున్న వ్యవహారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం బచ్చేహళ్లిలో తాజాగా చోటుచేసుకుంది. బచ్చేహళ్లిలో సర్వే నంబర్‌ 97–1లో వైఎస్సార్‌సీపీ నాయకురాలి కుటుంబానికి 97 సెంట్ల పొలం ఉంది. ఈ 97 సెంట్లలో కొంత భూమిని.. పక్కనే సర్వే నంబర్‌ 97–2లో కొంత భూమి ఉన్న టీడీపీ నేత మల్లన్న ఆక్రమించుకున్నాడు.

ఆక్రమణ నుంచి వైదొలగవలసిందిగా ఎన్నిసార్లు చెప్పినా మల్లన్న వినకపోవడంతో తమ పొలానికి సర్వే చేయాలని వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళా రైతు, బాధితురాలు భార్గవి తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో శనివారం స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసుల రక్షణతో పొలం సర్వే చేసేందుకు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ నేత మల్లన్న, అతని కుటుంబ సభ్యులు అశ్వర్థమ్మ, తిప్పేస్వామి, కవిత, శివ.. పచ్చ కండువాలు కప్పుకుని మరీ అక్కడకు వచ్చారు. పోలీసులను, రెవెన్యూ అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు.

సర్వే చేయడానికి మీరు ఎవర్రా..? అంటూ  దాడికి దిగారు. దాడిలో సర్వేయర్‌ శ్రీ లక్ష్మి కింద పడిపోగా, మహిళా కానిస్టేబుల్‌ రాజ్యలక్ష్మి చేతికి బలమైన గాయమైంది. అటు శెట్టూరు ఎస్‌ఐ సుమన్, కంబదూరు ఎస్‌ఐ లోకేశ్‌పైనా దురుసు­గా ప్రవర్తిస్తూ చొక్కాలు చిరిగిపోయేలా దాడి చేశారు.  అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డిపైనా దాడికి యత్నించగా.. వీఆర్‌ఏలు, సిబ్బంది అడ్డుకున్నారు. అయితే స్థానికులు, పాత్రికేయులు జరిగిన సంఘటనను తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేస్తుండగా పోలీసులు అడ్డుకుని వీడియోలు, ఆడియోలను తొలగించడం గమనార్హం.  ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు శెట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

అధికారులపై దాడి హేయం 
ఇలా దాడి చేయడం హేయం. మాకు పీజీఆర్‌­ఎస్‌లో వచ్చిన అర్జీ మేరకు శనివారం పొలం సర్వే చేయడానికి వెళ్లగా..మమ్మల్ని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారు. ఎన్నడూ లేని విధంగా గ్రామంలో ఇలా ప్రభుత్వ అధికారులపై దాడికి దిగడంతో భయాందోళనకు గురయ్యాం. – అనిల్‌ కుమార్‌ రెడ్డి, శెట్టూరు డిప్యూటీ తహసీల్దార్‌

Advertisement
 
Advertisement
Advertisement