ప్రభుత్వ భూమిపై పచ్చ రాబందులు | TDP Goons Scams: Government Land Grabbing in AP | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిపై పచ్చ రాబందులు

Mar 29 2026 5:28 AM | Updated on Mar 29 2026 5:28 AM

TDP Goons Scams: Government Land Grabbing in AP

తిరుపతి జిల్లా దళవాయిపల్లి వద్ద ప్రభుత్వ భూమిని చదును చేసిన దృశ్యం

తిరుపతి జిల్లా పుల్లంపేటలో 133 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ

దర్జాగా కంచె ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు.. ఆ భూములను 2012 నుంచి సాగు చేసుకుంటున్న దళితులు

2014లో దళితులపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టించిన టీడీపీ నేతలు

వైఎస్సార్‌సీపీ హయాంలో ఆ భూములను దళితులకు ఇవ్వాలని నిర్ణయం

చంద్రబాబు ప్రభుత్వం రాగానే రూ.కోట్లు విలువైన భూముల్లోకి మళ్లీ టీడీపీ నేతలు

తిరిగి దళితులపైనే అక్రమ కేసులు పెట్టించిన నాయకులు 

న్యాయం కోసం పుల్లంపేట పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించిన దళితులు

పుల్లంపేట: టీడీపీ నేతల భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. అధికారం అండతో తిరుపతి జిల్లా రైల్వేకో­డూరు నియోజక­వర్గం పుల్లంపేటలో కోట్ల రూపాయల విలువైన 133 ఎకరాల ప్రభుత్వ భూమిపై రాబందుల్లా వాలిపో­యారు. పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించేసుకున్నారు. చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేసేశారు. వారి ఆక్రమణలను అడ్డుకున్నందుకు దళితులపై అక్రమంగా కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 

పుల్లంపేట మండలంలోని దళవాయిపల్లి సర్వే నంబర్‌ 225లో వంద ఎకరాలు, వత్తలూరు సర్వే నంబర్‌ 1042, 1055లో 24 ఎకరాలు, తిప్పాయిపల్లి సర్వే నంబర్‌ 1094/6లో 9 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చెట్టు, పుట్టలతో ఉన్న ఈ భూమిని స్థానిక నిరుపేదలైన దళితులు చదును చేసుకుని సాగు చేసుకునేవారు. విలువైన భూములు దళితుల సాగు చేసుకోవటం జీర్ణించుకోలేని టీడీపీలోని పెత్తందారులు వారిపై దౌర్జన్యాలకు తెగబడేవారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భూములను ఆక్రమించుకున్నారని 15 మంది దళితులపై కేసులు నమోదు చేయించారు. అప్పటి నుంచి టీడీపీ నేతలు, దళితుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకునేవి.

వైఎస్సార్‌సీపీ హయాంలో దళితులకు భూ పంపిణీకి ఏర్పాట్లు
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్లకు 2022లో ఆ పార్టీ నాయకులు ఇరు వర్గాల మధ్య రాజీ చర్చలు జరిపి కేసులు వెనక్కు తీయించుకునేలా కృషి చేశారు. నిరుపేద దళితుల జీవనాధారం కోసం సాగు చేసుకున్న ప్రభుత్వ భూములను వారికే పంపిణీ చేయాలని 2023లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని సాంకేతిక కారణాల కారణంగా ఆ  ప్రక్రియ ఆలస్యమైంది. 2024లో ప్రభుత్వం వచ్చిన వెంటనే పంపిణీ చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దళితుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. 

ప్రభుత్వం మనదే కదా అని టీడీపీ నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ముగ్గురు టీడీపీ నాయకులు ప్రభుత్వ భూముల్లోకి చొరబడి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఆపై రాత్రికి రాత్రే భూముల చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నేతల భూ ఆక్రమణ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు కంచె తొలగించారు. అయినప్పటికీ దళితులపై దౌర్జన్యానికి దిగి... వారిపైనే టీడీపీ నాయకులు కేసులు పెట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంతోపాటు తమపై దౌర్జన్యానికి దిగారని దళితులంతా కలిసి శనివారం పుల్లంపేట పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయమని వేడుకున్నారు. అదేవిధంగా టీడీపీ నేతల దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమి అమ్మకానికి పెట్టేసిన పోలీసులు
పుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలోని 9 ఎకరాలను ఓ పోలీసు అధికారి ఏకంగా అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. తొమ్మిది ఎకరాలు రూ.40 లక్షలకు బేరం కుదిరినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.  

ఇదెక్కడి న్యాయం?
మాది వత్తలూరు హరిజనవాడ. భూమి లేని పేదవాళ్లం. 2012 నుంచి ఆ భూమిలో పంటలు సాగు చేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వంలో మాపై కేసులు పెట్టారు. కోర్టుల చుట్టూ తిరిగాము. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక కోర్టులో రాజీపడ్డాం. పంటలు సాగు చేసుకుంటూ వచ్చాం. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దౌర్జన్యంగా రాత్రికి రాత్రే టీడీపీ నాయకులు భూములను ఆక్రమించి తిరిగి మాపైనే కేసులు నమోదు చేయించారు. ఇదెక్కడి న్యాయం?
– నల్ల బ్రహ్మయ్య, పుల్లంపేట మండలం

జీవితమంతా పోరాటమే 
గత 20 ఏళ్లుగా భూమి కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మేము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వమని వేడుకుంటున్నాం. చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది ఎకరాల భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. పేదవాళ్లు భూమి కావాలంటే ఇన్ని కష్టాలా?
– ఎస్‌.జయమ్మ, వత్తలూరు

మాపైనే అక్రమ కేసులు
మా నాన్న గారు ఉన్నప్పటి నుంచి భూమి కోసం పోరాడుతున్నాం. ఈ భూమి కోసం పోరాడి పోరాడి మా నాన్న కూడా మరణించాడు. భూమి మాత్రం ఇవ్వలేదు. అక్రమ కేసులు మాత్రం నమోదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. 
– ఎస్‌.మహేష్, వత్తలూరు గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement