అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం
మూజువాణి ఓటుతో సభ ఏకగ్రీవంగా ఆమోదం
ఇక రాజధానిని ఎవరూ అంగుళం కూడా కదిలించలేరన్న సీఎం
అమరావతి, విశాఖ, తిరుపతి రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులన్నింటినీ 2028 నాటికి పూర్తి చేసి, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ మాదిరి ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి అనుకునేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని.. యుమునా నది పవిత్ర జలాలను, పార్లమెంట్‌లోని పవిత్ర మట్టిని తెచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారన్నారు.
అమరావతి స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టెయినబుల్) ప్రాజెక్టు అని పునరుద్ఘాటించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించింది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్–5(2)ను సవరిస్తూ కొత్తగా ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చేర్చడంతో పాటు సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలను కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ సీఎం చంద్రబాబు సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు.
చర్చ అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందినట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అంతకుముందు తీర్మానంపై సభలో జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు జవాబిస్తూ.. అమరావతిని ఇక ఎవరూ టచ్ చేయలేరని, అంగుళం కూడా కదిలించే పరిస్థితి రాదన్నారు. ‘ఏపీకి ఒక్కటే రాజధాని. అది అమరావతి మాత్రమే. అదే శాశ్వతం. ఇప్పటికే తీర్మానం చేశాం.
అసెంబ్లీ తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా దృఢత్వం వస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆంధ్రప్రదేశ్ ఆత్మ, ఆమరావతి అందరిదీ అనేలా ఈ నగర నిర్మాణం చేస్తాం’ అని తెలిపారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్ నగరాన్ని తెలుగు జాతి కోసం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.
అమరావతిలో ఆదాయం సృష్టిస్తాం
‘నాలుగోసారి సీఎం అయ్యా. 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నా లక్ష్యం ఒక్కటే. ఆ రోజు సైబరాబాద్‌ను అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశా. ఈ రోజు అమరావతిని అలా చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ దేహం అయితే అమరావతి గుండె. నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగౌరవంగా చెప్పుకునేలా తయారు చేసే బాధ్యత మనందరిది. బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. ఇక్కడ ఆదాయం సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఇక్కడి ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి తెస్తాం.
దేశంలో ఇప్పుడున్న నగరాలన్నీ ఒకప్పుడు కట్టిన నగరాలు. హైదరాబాద్ ఇటీవల కాలంలో కట్టిన నగరం. అమరావతి భవిష్యత్ నగరం. వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేస్తాం. ప్రపంచంలో, దేశంలో ఎన్ని లేటెస్టు టెక్నాలజీలు ఉన్నాయో అవన్నీ తెస్తాం. రాష్ట్రాన్ని విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. మూడు మెగా సిటీలు అభివృద్ధి చేస్తాం. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి, జాతికి అంకితమిస్తాం. ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడున్నాడో తెలియదు. తన స్టాండ్ ఏమిటో చెప్పలేదు’ అని చంద్రబాబు అన్నారు. కేంద్ర
హోంశాఖకు తీర్మానం కాపీ
రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆమోదం పొందిన తీర్మానం కాపీని అసెంబ్లీ జనరల్ సెక్రటరీ శనివారం సాయంత్రం కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి, ఏపీ సీఎస్‌కు పంపారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల విభాగం (ఐ అండ్ పీఆర్) ఒక ప్రకటన విడుదల చేసింది.


