బాబు సర్కారు డైవర్షన్‌ డ్రామా! | Chandrababu Govt Diversion Drama of Farmers Problems in Amaravathi | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు డైవర్షన్‌ డ్రామా!

Mar 29 2026 4:54 AM | Updated on Mar 29 2026 5:01 AM

Chandrababu Govt Diversion Drama of Farmers Problems in Amaravathi

రాజధాని, ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే సర్కారు పన్నాగం 

రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై చర్చ జరగాలి

ఇప్పటిదాకా ఎలా దోచుకున్నారో.. ఎలా దోచుకోబోతున్నారో చర్చ జరగాలి 

ఏ రైతుకు ఎక్కడ ఏ ప్లాటు ఇచ్చారో చర్చ జరగాలి.. ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేయడంపై చర్చ జరగాలి 

రాజధాని రైతులు సీఆర్‌డీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంపై చర్చ జరగాలి 

భూములిచ్చి 12 ఏళ్లు అయినా.. ఏడేళ్లు మీరే అధికారంలో ఉన్నా పట్టించుకోక పోవడంపై చర్చ జరగాలి 

రెండవ, మూడవ విడత భూ సేకరణ యత్నాలపై చర్చ జరగాలి 

రాజధాని పేరుతో ఎంత అప్పు చేశారో.. భవిష్యత్తులో ఇంకా ఎంత అప్పు తెస్తారో చర్చ జరగాలి 

ఆ అప్పుల్లోంచి ఎంత దోచుకున్నారో.. దోచుకోబోతున్నారో కూడా చర్చ జరగాలి 

సూపర్‌ సిక్స్‌ హామీలపై, కాంట్రాక్టుల్లో కమీషన్లపైనా చర్చ జరగాలి 

రైతులు, విద్యార్థి, ఉద్యోగ వర్గాల సమస్యలపై చర్చ జరగాలి 

ఇన్ని సమస్యలను గాలికొదిలేసి ఒక్క జగన్‌ను తిట్టడానికే అసెంబ్లీ సమావేశమా? 

అన్ని రంగాల్లో వైఫల్యం నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ అంటున్న ప్రజలు, మేధావులు 

అమరావతికి చట్టబద్ధత పేరుతో చట్ట విరుద్ధ తీర్మానం.. కౌన్సిల్‌ను హాజరు పరచకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానమా?  

సాక్షి, అమరావతి: రాజధానిలో రైతుల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాటి నుంచి తప్పించుకునేందుకు మరోసారి సరికొత్త డ్రామాకు తెరలేపింది. ఎన్నెన్నో సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుతంత్రానికి పాల్పడుతోంది. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్ల తర్వాత రాజధానికి చట్టబద్ధత అంశం గుర్తుకొచ్చినట్లు నటిస్తోంది. ప్రజా సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించేలా అమరావతికి చట్టబద్ధత పేరుతో చట్టవిరుద్ధ తీర్మానం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. శాసన మండలిని హాజరు పరచకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేయడాన్ని ఇందుకు నిదర్శనంగా ఎత్తి చూపుతున్నారు. 

‘రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై చర్చ జరగాలి.. ఇప్పటిదాకా ఎలా దోచుకున్నారో, ఎలా దోచుకోబోతున్నారో చర్చ జరగాలి.. ఏ రైతుకు ఎక్కడ ఏ ప్లాటు ఇచ్చారో చర్చ జరగాలి.. ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేయడంపై చర్చ జరగాలి.. సమస్యల పరిష్కారం కోసం రాజధాని రైతులు సీఆర్‌డీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంపై చర్చ జరగాలి.. ఏడేళ్లు మీరే అధికారంలో ఉన్నా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వక పోవడంపై చర్చ జరగాలి.. రెండవ, మూడవ విడత భూ సేకరణ యత్నాలపై చర్చ జరగాలి.. రాజధాని పేరుతో ఎంత అప్పు చేశారో.. భవిష్యత్తులో ఇంకా ఎంత అప్పు తెస్తారో చర్చ జరగాలి.. ఆ అప్పుల్లోంచి ఎంత దోచుకున్నారో.. దోచుకోబోతున్నారో కూడా చర్చ జరగాలి.. సూపర్‌ సిక్స్‌ హామీలపై, కాంట్రాక్టుల్లో కమీషన్లపైనా చర్చ జరగాలి.. రైతులు, విద్యార్థి, ఉద్యోగ వర్గాల సమస్యలపై చర్చ జరగాలి’ అని ప్రజలు, మేధావులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఇన్ని సమస్యలను గాలికొదిలేసి ఒక్క జగన్‌ను తిట్టడానికే అసెంబ్లీ సమావేశమా? అని నిలదీస్తున్నారు. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం తన వైఫల్యం నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ అంటూ మండిపడుతున్నారు. 

ఇది చట్ట ధిక్కరణే
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానం చట్టాన్ని ధిక్కరిస్తున్నట్లుగా ఉందని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు చట్టాలు, రాజ్యాంగం గురించి గొప్పగా చెబుతూనే వాటికి తిలోదకాలు ఇచ్చేలా తీర్మానం చేయడాన్ని ఎత్తి చూపుతున్నారు. రాష్ట్ర శాసన వ్యవస్థలో శాసనసభ, శాసన మండలి భాగంగా ఉంటే, కేవలం శాసనసభలో మాత్రమే ఈ తీర్మానం ఎలా చేస్తారనే ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కరువైంది. సాధారణంగా ఈ రెండు సభలు ఎప్పుడూ సమాంతరంగా జరుగుతాయి. ప్రత్యేక సెషన్‌ పేరుతో కేవలం అసెంబ్లీని మాత్రమే నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. 


ఒక సభలో మెజారిటీ ఉండి, రెండవ సభలో లేనప్పుడు.. రెండవ సభను కావాలనే హాజరు పరచకపోవడం చట్టసభల సమగ్రతను దెబ్బ తీయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఒక అంశానికి పూర్తి స్థాయి చట్టబద్ధత రావాలంటే.. అది బిల్లు రూపంలో ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. తీర్మానం అయినా ఉభయ సభలు చేస్తేనే దానికి నైతికత ఉంటుంది. కేవలం ఒక సభ మాత్రమే తీర్మానం చేస్తే, అది ఆ సభలోని అధికార పార్టీ రాజకీయ తీర్మానంగానే మిగిలి పోతుందనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు ఇప్పుడు అమరావతి చట్టబద్ధత కోసం అంటూ చేసిన తీర్మానం రాజకీయ తీర్మానంగానే మిగిలిపోయింది. శాసన మండలిని బైపాస్‌ చేస్తూ చేసిన ఈ తీర్మానం ఒక రాజకీయ గిమ్మిక్కే తప్ప అందరి ఆమోదంతో చేసింది ఎలా అవుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

అమరావతి కుంభకోణాలు బయట పడతాయని భయం 
రాజధాని అమరావతి ముసుగులో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు శనివారం కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించలేదని స్పష్టమవుతోంది. రాజధాని ముసుగులో 2014–19లోనే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి, వేల ఎకరాల భూములను తను, తన బినామీల గుప్పిట్లో పెట్టుకున్నారు. కాంట్రాక్టుల ముసుగులో అప్పట్లోనే వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇప్పుడు ఆ భూములకు రేట్లు పెరిగేలా హంగామా చేయడం, నిర్మాణాల పేరుతో రెట్టింపు అంచనాలతో భారీగా కమీషన్లు తీసుకోవడం, ఇందుకోసం భారీగా అప్పులు తెస్తున్న ఉదంతాలన్నీ చర్చకు వస్తాయనే కౌన్సిల్‌ సమావేశం జరపకుండా కేవలం అసెంబ్లీ సమావేశం మాత్రమే పెట్టి తీర్మానం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జగన్‌పై బురదజల్లడానికి పోటాపోటీ 
ఈ తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చ ఆద్యంతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యంగానే సాగింది. ఆయనపై బురదజల్లి లబ్ధి పొందడానికి చంద్రబాబు, లోకేశ్‌ ప్రయత్నించగా.. వారిని బుట్టలో వేసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడి జగన్‌పై తిట్ల వర్షం కురిపించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరీ బరితెగించి జగన్‌పై నోరు పారేసుకోవడం చూసి అధికార పార్టీ నాయకులే ఆశ్చర్యపోయారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు ఓట్లేసి ప్రజలు తప్పు చేశారంటూ ప్రజాభిప్రాయాన్ని సైతం గౌరవించకుండా వారినీ ఆడిపోసుకోవడం చూస్తే అధికార గర్వం అచ్చెన్నాయుడి  తలకు ఏ స్థాయిలో ఎక్కిందో అర్థమవుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభలో ఆయన ఇంత అడ్డగోలు భాష మాట్లాడడం వెనుక మంత్రి పదవిని రక్షించుకునే ఆరాటం ఉందని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఆయన మంత్రి పదవి ఊడిపోయేలా ఉండడంతో ఎలాగైనా లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు జగన్‌పై చెలరేగిపోయినట్లు ఎమ్మెల్యేలు చర్చించుకోవడం గమనార్హం. 

తిన్నింటి వాసాలు లెక్కపెట్టామన్న వసంత, యార్లగడ్డ
వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, రెడ్డప్పగారి మాధవిరెడ్డి తదితరులు జగన్‌ను తిట్టడానికి పోటీ పడ్డారు. వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తమ ప్రసంగాల ద్వారా చాటారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉంటూనే చంద్రబాబుకు మద్దతుగా వాదన వినిపించామని నిస్సిగ్గుగా  వారిద్దరూ సభలో చెప్పుకోవడం విశేషం. అప్పట్లో తాను అమెరికా వెళ్లినప్పుడు కూడా అమరావతిని స్వాగతిస్తూ పచ్చ పత్రికకు ప్రకటన ఇచ్చినట్లు యార్లగడ్డ సభలో చూపించారు. 

సభలో ఆద్యంతం చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్, ఇతర నేతలంతా వైఎస్‌ జగన్‌ అమరావతికి వ్యతిరేకం అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆయన ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదన్న విషయాన్ని దాచిపెట్టి, కేవలం ఆయనపై అభాండాలు మోపుతూ.. విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఒకరి భుజాలు ఒకరు తడుముకుని బల్లలు చరుచుకున్నారు. స్పీకర్‌ స్థానంలో తటస్థంగా ఉండాల్సిన చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజకీయ ప్రసంగం చేసి సభ ఔన్నత్యాన్ని మరోసారి దెబ్బతీశారు. ఆ 11 మంది ఈసారి కూడా సభకు రాలేదని వైఎస్సార్‌సీపీపై రాజకీయ విమర్శ చేశారు. పనిలో పనిగా చంద్రబాబును పొగుడుతూ స్వామి భక్తిని చాటుకున్నారు.

రాజధాని రైతులను  మాయ చేసేందుకే..
తమ భూములు తీసుకుని 12 ఏళ్లు దాటినా, ఇంత వరకు ప్లాట్లు ఇవ్వకుండా కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం వందల ఎకరాలు కట్టబెడుతుండడంపై రాజధాని రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో తీసుకున్న భూముల సంగతి ఇంకా తేల్చకుండానే ఇప్పుడు రెండవ విడత భూ సమీకరణ చేస్తుండడం, మూడవ విడతకు సిద్ధమవుతుండడంపై రాజధాని ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గ్రామ సభల్లో రైతుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నములుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానికి చట్టబద్ధత అంటూ రాజధాని రైతులను మాయ చేసేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని ఉన్నత స్థాయి ఉద్యోగ వర్గాల సమాచారం. మరోవైపు ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల్లోనూ అంతకంతకూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వారిని మభ్య పెట్టేందుకు, వారి దృష్టి మళ్లించేందుకు చట్టబద్ధ తీర్మానం పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఇట్టే తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement