మంత్రులు వచ్చి వెళ్లాకే బోట్లు మాయం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా తరలింపు
నాలుగు బోట్లకు15 వేల లీటర్ల డీజిల్
అంత డీజిల్ ఎక్కడ నుంచి వచ్చింది? ప్రభుత్వ పెద్దల సహకారంతోనే కుట్ర
మీ అంతు చూస్తామంటూ తమిళనాడు జాలర్ల హెచ్చరికలు
తీరానికి సమీపంలో వేట.. వలలు ధ్వంసం, మత్స్యకారులపై దాడులు
వేటకు వెళ్లేందుకు భయపడుతున్న గంగపుత్రులు
భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్న 164 గ్రామాల మత్స్యకారులు
గంగపుత్రులకు అధికార టీడీపీ పెద్దలు వెన్నుపోటు పొడిచారు. తమిళనాడు జాలర్లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం స్థానిక మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఐదు నెలల కింద స్వాదీనం చేసుకున్న పాండిచ్చేరి (కరైకల్) బోట్లను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ వద్ద ఉంచారు.
ఇటీవల టీడీపీ కీలక మంత్రులు వచ్చి వెళ్లాక వాటిని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మత్స్యకార గ్రామాలు రగిలిపోతున్నాయి. ఈ కుట్ర వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు అండగా నిలవకుండా తెరవెనుక లాలూచీకి పాల్పడ్డారంటూ కూటమి నేతల కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్ కార్యాచరణకు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.
సింగరాయకొండ: తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో మన తీర ప్రాంతంలో చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇదంతా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీనిపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొంత వరకు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకుకెళ్లినా ప్రయోజనం లేదు. సోనాబోట్ల ఆగడాలతో విసిగిపోయిన మత్స్యకారులు వాటిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ ప్రాంత మత్స్యకారులు ఏకమై ఒక సైన్యంలా ఏర్పడ్డారు. ప్రాణాలకు తెగించి తీరానికి వచ్చిన సోనాబోట్లను వెంబడించారు. తమిళనాడు జాలర్లను తరమికొట్టారు. నాలుగు సోనాబోట్లను స్వాదీనం చేసుకున్నారు. వాటిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్‌లో భద్రపరిచారు. ఎనిమిది నెలల కిందట జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్లను తమ భద్రతలో ఉంచుకున్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిడిలు వచ్చినా వదిలేందుకు మత్స్యకారులు ససేమిరా అన్నారు.
మీ అంతుచూస్తామంటూ బెదిరింపులు
‘‘మా బోట్లను నిర్బంధించి, 8 నెలల పాటు ఇబ్బందులకు గురిచేస్తారా మీ అంతుచూస్తాం’’ అంటూ కరైకల్ మత్స్యకారులు బెదిరింపులకు దిగుతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా తీరానికి దగ్గరగా చేపల వేట సాగిస్తూ లక్షలాది రూపాయల విలువైన వలలు తెంచేస్తూ స్థానికులు కనబడితే దాడులకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. చివరకు వారు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
జువ్వలదిన్నెలో ఆ రాత్రి ఏం జరిగింది..
ఇటీవల జువ్వలదిన్నెకు మంత్రులు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు వచ్చి వెళ్లాక హార్బర్ నుంచి మత్స్యకారులు స్వాదీనం చేసుకున్న సోనాబోట్లు మాయమయ్యాయి. టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతనే మంత్రులు వచ్చి ఈ మంత్రాంగం అంతా నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు వచ్చిన కార్యక్రమానికి టీడీపీకి అనుకూలంగా ఉన్న మత్స్యకారులను మాత్రమే అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సమయంలో కరైకల్ ప్రాంతంలోని సోనాబోట్లకు చెందిన మత్స్యకారులు కూడా హార్బర్‌లోకి ప్రవేశించి అక్కడ నిర్బంధంలో ఉన్న నాలుగు బోట్లకు డీజిల్ నింపారు. ఒక్కో సోనాబోటుకు సుమారు 10 వేల లీటర్ల సామర్ధ్యమున్న డీజిల్ ట్యాంకు ఉంటుంది. ఈ ప్రకారం నాలుగు సోనాబోట్లకు సుమారు ఒకటిన్నర డీజిల్ ట్యాంకర్ సుమారు 15 వేల లీటర్లు నింపారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తరువాత అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా బోట్లను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు.
మూడు బోట్లకు చెందిన ఇంజన్లు పనిచేయగా, ఒక బోటు ఇంజన్ మాత్రం మొరాయించింది. దీంతో ఆ బోటును మిగతా వాటికి కట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై వెంటనే తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన సోనాబోట్లలో పనిచేస్తున్న తమ ప్రాంతానికి చెందిన వారిని అప్రమత్తం చేశారు. వారు ఆ బోట్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరమ్మతులకు గురైన బోటును వదిలేసి మిగతావాటితో పరారయ్యారు.
వారు వదిలేసిన బోటును స్థానిక మత్స్యకారులు వెనక్కి తీసుకొస్తుండగా కరైకల్‌కు చెందిన మత్స్యకారులు సుమారు 12 బోట్లలో చుట్టుముట్టారు. దాడికి యత్నించారు. బోటును ఢీకొట్టారు. దౌర్జన్యానికి దిగి మరమ్మతులకు గురైన బోటును తీసుకెళ్లిపోయారు. బోటును ఢీకొట్టడంతో లోపలిభాగం ధ్వంసమైంది. దానిని మరమ్మతులు చేయాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెర వెనకున్నదెవరు..?
జువ్వలదిన్నె హార్బర్‌లో మెరైన్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న నాలుగు బోట్లను కరైకల్ మత్స్యకారులు తరలించుకుపోవటంపై భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఈ పని జరిగే అవకాశం ఉందా అని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెరవెనుక కుట్రలు చేసి బోట్లను వదిలేసి నేడు దానిని కప్పిపుచ్చుకునేందుకు మంత్రులు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు అండగా ఉంటామంటూ ప్రకటనలు చేయడం సరికాదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కుట్రదారులెవరో తేల్చాలని వారు డిమాండ్ చేస్తుŠాన్నరు. 15 వేల లీటర్ల డీజిల్ ఎక్కడ నుంచి వచ్చిందో బహిర్గతం చేయాలని నిలదీస్తున్నారు.మెరైన్ పోలీసుల రక్షణలో ఉన్న నాలుగు బోట్లు ఎలా వెళ్లాయో ప్రకటించాలని వారు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నారు.
త్వరలో 164 గ్రామాల మత్స్యకారుల సమావేశం
కరైకల్ బోట్ల వ్యవహారంపై శ్రీకాకుళం నుంచి తడ వరకు ఉన్న 164 మత్స్యకార గ్రామాల ప్రజలు సమావేశమై తదుపరి కార్యాచరణకు సమాయత్తమవుతున్నారు. వీరు త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్‌లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారని స్థానిక మత్స్యకారుడు వివరించారు.
ఐదు నెలలుగా ఎటువంటి భయం లేకుండా చేపల వేట సాగించామని, ఇప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు సమస్య పరిష్కరించకుండా మరింత సమస్యను సృష్టించారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


