రైతుల్ని దోచుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం | Ycp Dharna in front of Nellore DSO office | Sakshi
Sakshi News home page

రైతుల్ని దోచుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం

Mar 29 2026 5:19 AM | Updated on Mar 29 2026 5:19 AM

Ycp Dharna in front of Nellore DSO office

నెల్లూరు డీఎస్‌ఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులు

వైఎస్సార్‌సీపీ పాలనలో పుట్టి ధాన్యం రూ.24 వేలు 

కూటమి పాలనలో రూ.15 వేల నుంచి 17 వేల మధ్యే 

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 

రైతులతో కలిసి నెల్లూరు డీఎస్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా 

నెల్లూరు రూరల్‌: రైతులను మిల్లర్లు, దళారులు నిలువునా దోచుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వరి కోతలకు ముందు పుట్టి ధాన్యం (845 కేజీలు) ధర రూ.22 వేలు ఉందని అధికారులు చెబితే.. ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. 

జిల్లాలో ధాన్యం ధరల పతనం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ పార్టీ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు శివుని నర్సింహారెడ్డి, ఇతర నాయకులు, రైతులతో కలిసి శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కాకాణి మాట్లాడుతూ.. మిల్లర్లు చేస్తున్న దోపిడీలో అధికారులు, మంత్రులు, పాలకులు వాటాలు పంచుకుంటున్నారా అని నిలదీశారు. 

చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులను ఆదుకుంటామని పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులు దోపిడీకి గురవుతున్నారన్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో 20 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుంటే.. కేవలం 1.5 లక్షల టన్నులు మాత్రమే ధాన్యం కొనాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు టార్గెట్‌ ఇవ్వడం చూస్తే.. రైతులను ఏ విధంగా మోసం చేస్తోందో అర్థమవుతోందన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 2.5 శాతం మాత్రమే ధాన్యం కొంటున్నారని, మిగిలిన 97. 5 శాతం దళారులు, మిల్లర్లు దోచుకుపోతున్నారన్నారు.  

తేమ పేరిట 90 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు 
నిబంధనల ప్రకారం 17 శాతం కంటే ఒక శాతం అధికంగా తేమ ఉంటే క్వింటాల్‌కు ఒక కేజీ లెక్కన తరుగు కింద అదనంగా తీసుకోవాల్సి ఉండగా.. పుట్టికి 90 కేజీల అదనపు తరుగు తీసుకుంటున్నారని కాకాణి ఆరోపించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన గన్నీ బ్యాగులు అందజేసి, అన్ని సదుపాయాలు కల్పించామని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచామని చెప్పారు. 

చంద్రబాబు రూ.500 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో పుట్టి ధాన్యానికి రూ.24 వేలు ధర వస్తే.. అది జగన్‌మోహన్‌రెడ్డి గొప్పతనం కాదని, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ధరలు పెరిగాయని టీడీపీ నేతలు, పచ్చమీడియా దు్రష్పచారం చేశాయన్నారు. 

ఈ రోజు ధరలు పడిపోతుంటే ఇరాన్‌ యుద్ధం వల్ల అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం తక్షణమే అధికారులు స్పందించి, మద్దతు ధర అమలయ్యేలా చూడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు,  రైతులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement