బాబు కుట్రలో భాగమే.. కార్టూన్‌ బరితెగింపు | YSRCP angry over cartoon | Sakshi
Sakshi News home page

బాబు కుట్రలో భాగమే.. కార్టూన్‌ బరితెగింపు

Mar 29 2026 5:25 AM | Updated on Mar 29 2026 5:25 AM

YSRCP angry over cartoon

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో ఎస్‌ఐకు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

మరింత దిగజారిన ఈనాడు

విలువల వలువలు విడిచేసి.. పాత్రికేయ ప్రమాణాలకు పాతరేసి.. 

చంద్రబాబు మేలుకోసం ఎలాంటి పాతకానికైనా ఈనాడు సిద్ధం 

రాజధానికి వైఎస్‌ జగన్‌ వ్యతిరేకమని దుష్ప్రచారం 

ప్రజలను పక్కదారి పట్టించే పన్నాగం.. 

నాడు ఎన్టీఆర్‌పైనా ఈనాడు ఇదేరకమైన కార్టూన్ల కుట్ర 

ఆ కార్టూన్లు వేసిన శ్రీధర్‌కు ప్రభుత్వ సలహాదారు పదవి 

ఈనాడు కార్టూన్‌పై భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ.. 

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. పోలీసులకు ఫిర్యాదులు.. 

సాక్షి, అమరావతి: విలువల వలువలు ఏనాడో విడిచేసిన ఈనాడు పత్రిక.. చంద్రబాబు ప్రయోజనం కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధమని మరోమారు రుజువు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడానికి తహతహలాడే ఎల్లో మీడియా.. రాజధాని ముసుగులో మరోమారు దిగజారింది. రాజధాని అమరావతికి వైఎస్‌ జగన్‌ వ్యతిరేకం అనే దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేసే రీతిలో ఓ దిగజారుడు కార్టూన్‌ను ఈనాడు పత్రిక శనివారం ప్రచురించింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తన మార్కు పాత్రికేయ కుతంత్రానికి తెగబడింది. 

ఆనాడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం కోసం అనేక దిగజారుడు కార్టూన్లను ప్రచురించిన ఈనాడు పత్రిక అలాంటి దిగజారుడు కార్టూన్‌తో శనివారం పసుపు విషాన్ని పత్రికలో చిమ్మింది. ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్‌ చూసి ఆ పత్రిక పాఠకులే కాదు తెలుగు పాఠకులంతా ఛీత్కరించినట్లు రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన నిరసనలే నిదర్శనం. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు.  

రాజధాని కట్టలేకే కార్టూన్‌ కుట్రలు 
రాజధాని నిర్మాణంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం మరోసారి దుష్ప్రచార కుట్రకు తెగబడింది. అమరావతికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం అనే అవాస్తవాన్ని పదే పదే ప్రచారం చేయాలన్న కుతంత్రంలో భాగంగానే ఈనాడు ఈ కార్టూన్‌ను ప్రచురించింది. దురుద్దేశపూరితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కార్టూన్‌ ప్రచురించింది.  వైఎస్‌ జగన్‌గానీ వైఎస్సార్‌సీపీ గానీ రాజధానిగా అమరావతిని ఏనాడూ వ్యతిరేకించనే లేదు. 

మూడు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే తమ ధ్యేయమని విస్పష్టంగా చెప్పారు. అయినా సరే చంద్రబాబు రాజకీయ కుట్రకు కొమ్ముకాసేందుకే 2019–24 వరకు ఈనాడు పత్రికతోపాటు పచ్చ మీడియా అంతా గగ్గోలు పెట్టి దుష్ప్రచారం సాగించింది. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రాజధానిగా అమరావతిని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించలేదు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాజధాని నిర్మాణం చేయాలనే డిమాండ్‌ చేస్తోంది. 

కానీ దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా సరే రాజధాని అమరావతి నిర్మాణంలో ఎటువంటి కదలికా లేదు. రూ.20వేల కోట్లకుపైగా అప్పులు చేసినా సరే రాజధాని నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉంది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో బరితెగించి అవినీతికి పాల్పడుతోంది.  టీడీపీ దోపిడీకి అమరావతి కామధేనువుగా మారిందన్నది స్పష్టమవుతోంది.  అరచేతిలో వైకుంఠం చూపించేందుకే అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ఉంచుతోంది. 

రాజధాని నిర్మాణానికి 30ఏళ్లు పడుతుందని చెబుతోంది. రాజధాని నిర్మాణానికి ఏకంగా వందేళ్లు పడుతుందని ఏకంగా బ్రిజేష్‌ కుమార్‌ కమిటీకి చంద్రబాబు  ప్రభుత్వం నివేదించడం గమనార్హం. అంటే మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నట్టుగా రాజధాని అమరావతి నిర్మాణం తమ తరం కాదని చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది.  ఇదే సమయంలో అమరావతి పేరిట రెండో దశ, మూడో దశ భూసేకరణ పేరుతో చేస్తున్న హడావుడితో  అమరావతి ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

ఈ వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ‘అమరావతిపై అసెంబ్లీ తీర్మానం’పేరిట కొత్త నాటకానికి తెరతీసింది. అదే అదనుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎల్లో సిండికేట్‌ ఈ దుష్ప్రచారానికి తెగబడింది.  

ఎన్టీఆర్‌పైనా దిగజారుడు కార్టూన్లు 
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు కుట్రలో భాగస్వామి అయిన ఈనాడు పత్రిక ఆనాడు కూడా ఇలాంటి దిగజారుడు కార్టూన్లనే ప్రచురించింది. ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్టీ రామారావు వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రోజూ కార్టూన్లు ప్రచురించింది. ‘ఆయనకు తెలివి లేదు... రోజూ గంటకు మించి ఆలోచించ లేరు... ఒంటిపై బట్టలు కూడా సరిగా వేసుకోలేరు’ అనే రీతిలో దిగజారుడు కార్టూన్లు ప్రచురించడం గమనార్హం. 

ఎన్టీ రామారావు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఆయన భార్య లక్ష్మీ పార్వతిపై కూడా ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్లు పాత్రికేయ ప్రమాణాలను అథఃపాతాళానికి దిగజార్చాయి. ఆ దంపతులు ఇద్దర్నీ కించపరుస్తూ ప్రతి రోజు కార్టూన్లు ప్రచురించి ప్రజల్లో వారిపై వ్యతిరేకత తీసుకువచ్చే దుష్ప్రచార కుట్రను బరితెగించి సాగించింది. కార్టూన్లలో ముఖ్యమంత్రిని ఏకంగా అర్ధనగ్నంగా చూపిస్తూ ఈనాడు పత్రిక తన కుట్రను పతాకస్థాయికి తీసుకువెళ్లింది. ఆ విధంగా చంద్రబాబు, ఈనాడు రామోజీరావు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కేవలం 9 నెలల్లోనే భారీ కుట్రకు తెగబడ్డారు. 

అనంతరం 1995 ఆగస్టులో వైస్రాయ్‌ హోటల్‌ కుట్రతో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారు. అడ్డదారిలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి కుట్రకు సహకరించిన ఈనాడు రామోజీరావుకు అనంతరం చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది. ఎన్టీరామారావు ప్రభుత్వం విధించిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించింది. తద్వారా రామోజీ ఫిల్మ్‌సిటీ వ్యాపార ప్రయోజనాలకు సహకరించింది. ఇక రామోజీ ఫిల్మ్‌ సిటీ అసైన్డ్‌ భూముల ఆక్రమణ తదితర అక్రమాలకు అడ్డే లేకుండాపోయింది. ఆనాడు ఎన్టీరామారావు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కార్టూన్లు వేసిన నాటి ఈనాడు కార్టూనిస్ట్‌ శ్రీధర్‌కు చంద్రబాబు ఇటీవల ప్రభుత్వ సలహాదారు పదవిని ఇవ్వడం గమనార్హం. 

పోలీసులకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు 
వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా కుట్రపూరితంగా ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్‌పై వైఎస్సార్‌సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధంగా, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈనాడు పత్రిక కార్టూన్‌ ప్రచురించడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

ఈనాడు ప్రచురించిన కార్టూన్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈనాడు పత్రికపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు వెల్లడించారు. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఎడిటర్స్‌ గిల్డ్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement