ఆదాయం కంటే టీడీపీకి ఖర్చే ఎక్కువ 

TDP Expenditure is higher than revenue says ADR Report - Sakshi

టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ ఖర్చు తక్కువ 

ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలపై ఏడీఆర్‌ నివేదికలో వెల్లడి 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీల ఆదాయంపై అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థల తాజా నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో తెలుగుదేశం పార్టీకి ఆదాయం కంటే వ్యయం ఎక్కువని తేలింది. 2021 అక్టోబరు 11 నాటికి దేశవ్యాప్తంగా 42 ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలను ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. 42 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఆదాయం రూ.877.35 కోట్లుగా తెలిపింది. ఇందులో కేవలం ఐదు పార్టీలకే రూ.516.48 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. వీటిలో టీఆర్‌ఎస్‌కు రూ.130.46 కోట్లు (14.86 శాతం), శివసేనకు రూ.111.40 కోట్లు (12.69 శాతం), వైఎస్సార్‌సీపీకి రూ.92.739 కోట్లు (10.56 శాతం), టీడీపీకి  రూ.91.53 కోట్లు (10.43 శాతం), బిజూ జనతాదళ్‌కు రూ.90.35 కోట్లు (10.29 శాతం) వచ్చాయి.

వ్యయాల విషయానికొస్తే తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ రూ.21.18 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. అత్యధికంగా రూ.109.27 కోట్లు (83.76 శాతం) మిగులుతో ప్రాంతీయ పార్టీల్లో తొలి స్థానంలో నిలిచింది. శివసేన తనకు వచ్చిన ఆదాయంలో రూ.99.37 కోట్లు వ్యయం చేసింది. వైఎస్సార్‌సీపీ రూ.37.83 కోట్లు వ్యయం చేసి రూ.54.90 కోట్ల మిగులుతో ఉంది. టీడీపీ రూ.108.84 కోట్లు వ్యయం చేసి, ఆదాయం కన్నా రూ.17.31 కోట్లు ఎక్కువ వినియోగించింది. ఎంఐఎంకు రూ.1.68 కోట్లు ఆదాయం రాగా.. రూ.65 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది.  

తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేకు రూ.89.06 కోట్లు ఆదాయం రాగా.. రూ.28.82 కోట్లు ఖర్చు చేసింది. ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.49.95 కోట్లు ఆదాయం రాగా.. రూ.38.87 కోట్లు ఖర్చు చేసింది. ఆదాయానికి మించి వ్యయం చేసిన పార్టీల్లో బిజూ జనతాదళ్, డీఎంకే, సమాజ్‌వాదీ, జేడీ(ఎస్‌) ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం వైఎస్సార్‌సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ ఆదాయాలు గతంలో కంటే ప్రస్తుతం తగ్గాయని నివేదిక పేర్కొంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top