నర్సింగ్‌ కాలేజీలో దారుణం | Student unions protest at nursing college | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ కాలేజీలో దారుణం

Apr 9 2026 5:43 AM | Updated on Apr 9 2026 5:43 AM

Student unions protest at nursing college

తిరుపతి రూరల్‌: ఫీజు కట్టడం ఆలస్యం కావడంతో కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థినిని తీవ్రంగా అవమానించింది. మరుగుదొడ్లు కడిగించింది. తరగతి గదుల్లో చెత్త ఊడ్పించింది. విద్యార్థులు తిన్న ప్లేట్లు కడిగించింది. ఈ దారుణం వెలుగులోకి రావడంతో విద్యార్థిసంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ అమానవీయ ఘటన తిరుపతి జిల్లా తిరుపతి రూరల్‌ మండలం పెరుమాళ్లపల్లిలోని శ్రీ వికాస్‌ నర్సింగ్‌ కాలేజీలో జరిగింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రేణుమాకులపల్లికి చెందిన పి.రవికుమార్, శ్రీదేవిల కుమార్తె పి.నినిత ఈ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ ((యాజమాన్య కోటా సీటు )) రెండోసంవత్సరం చదువుతోంది. 

రెండో సంవత్సరం ఫీజు రూ.1.4 లక్షలు కట్టడంలో ఆలస్యం చేస్తున్నారని కాలేజీ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరించింది. ఆ విద్యార్థినితో మరుగుదొడ్లు కడిగించడం, తరగతి గదుల్ని ఊడ్పించి తుడిపించడం, విద్యార్థులు తిన్న ప్లేట్లు కడిగించడం వంటి పనులు చేయించి తీవ్ర అవమానాలకు గురిచేసింది. ఈ అవమానాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన విద్యార్థిని ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు కాలేజీకి వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థిసంఘాల నేతలకు మొరపెట్టుకున్నారు. 

బాధిత విద్యార్థిని, ఆమె బంధువులు, విద్యార్థిసంఘాల నేతలు బుధవారం సాయంత్రం కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఆ విద్యార్థినితో అలా పనులు చేయించలేదని బుకాయించేందుకు యాజమాన్యం ప్రయత్నించింది. దీంతో విద్యార్థిసంఘాల నేతలు రాత్రి 10 గంటల వరకు కాలేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయినా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్‌ పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 

కాలేజీ యాజమాన్యం మెట్టుదిగకపోగా.. విద్యార్థిసంఘాల నేతలు అక్కడ నుంచి వెళ్లబోమని తేల్చిచెప్పారు. రాత్రి 10 గంటల వరకు ఆ ప్రాంతం నినాదాలతో హోరెత్తింది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం ఇతర విద్యార్థినులను రెచ్చగొట్టి వీరికి వ్యతిరేకంగా కాలేజీ ప్రాంగణంలో ధర్నాకు కూర్చోబెట్టింది. దీంతో బాధిత విద్యార్థిని, విద్యార్థిసంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాత్రి 10.30 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement