9.25 లక్షల ఎకరాలుఫ్రీహోల్డ్‌ సక్రమమే | Chandrababu Naidu government has taken a U turn on freehold lands | Sakshi
Sakshi News home page

9.25 లక్షల ఎకరాలుఫ్రీహోల్డ్‌ సక్రమమే

Apr 9 2026 5:19 AM | Updated on Apr 9 2026 5:19 AM

Chandrababu Naidu government has taken a U turn on freehold lands

వాటికి విముక్తి కల్పిస్తున్నట్లు రెవెన్యూ సమీక్షలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 

వైఎస్సార్‌సీపీ హయాంలోనే 22 ఏ నుంచి తొలగించిన సర్వీస్‌ ఈనాం భూములపైనా అదే తీరు 

గతంలోనే 22 ఏ నుంచి తొలగించిన వాటిని ఇప్పుడు కొత్తగా మళ్లీ తొలగిస్తున్నట్లు ప్రకటన 

సాక్షి, అమరావతి: అసైన్డ్‌ భూములను సాగు చేసుకుంటున్న పేద రైతులకు భారీ ఊరటనిస్తూ ‘ఫ్రీహోల్డ్‌’తో సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం ముమ్మాటికీ సక్రమమేనని మరోసారి తేలిపోయింది. వైఎస్‌ జగన్‌ హయాంలో ఫ్రీహోల్డ్‌ అయిన భూముల్లో 9.25 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించాలని తాజాగా టీడీపీ కూటమి సర్కారు నిర్ణయించింది. 

ఈమేరకు ఫ్రీహోల్డ్‌ భూములపై చంద్రబాబు సర్కారు యూటర్న్‌ తీసుకుంది. 21 నెలల తర్వాత తాను చేసింది తప్పని గుర్తించడంతో ఎట్టకేలకు ఇప్పుడు ఆ భూములపై మళ్లీ యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకున్నారు.  

ఆంక్షలు విధించి అవే భూములు మళ్లీ ఫ్రీహోల్డ్‌..  
ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ భూములన్నింటినీ గత ప్రభుత్వంలో అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేశారని సీఎం చంద్రబాబు పదేపదే ఆరోపణలు చేశారు. ఆ సాకుతో ఫ్రీహోల్డ్‌ అయిన (యాజమాన్య హక్కులు వచ్చిన) భూములపై ఆంక్షలు విధించారు. దీంతో గత ప్రభుత్వంలో చరిత్రాత్మక రీతిలో యాజమాన్య హక్కులు పొందిన 13.59 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూముల రైతులు తమ భూములపై హక్కులు కోల్పోవాల్సిన దుస్థితి దాపురించింది. 

ఆ భూములన్నీ అక్రమం అని తేల్చడం కోసం చంద్రబాబు సర్కారు అధికారులతో పలుమార్లు వెరిఫికేషన్లు చేయించింది. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి అనేక దఫాలుగా నివేదికలు, వెరిఫికేషన్లపై చర్చలు జరిపారు. చివరికి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలోనే ఫ్రీహోల్డ్‌ చేసిన 9.25 లక్షల ఎకరాలను ఇప్పుడు మళ్లీ ఫ్రీహోల్డ్‌ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ చేసిన భూములనే ఇప్పుడు తాను ఫ్రీహోల్డ్‌ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకోవడం విస్మయం కలిగిస్తోంది.  

గత ప్రభుత్వంలో చరిత్రాత్మక చట్టం.. 
పేదలకు కేటాయించి 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం కోసం 2022లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చరిత్రాత్మక రీతిలో అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించింది. ఆ తర్వాత వెంటనే తొలిదశలో 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేసి పేద రైతులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించింది. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు భూములు కొట్టేశారని దు్రష్పచారం చేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు ఎన్నికల్లో లబ్ధి పొందారు. అనంతరం 2024లో అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేశారంటూ వాటిని మళ్లీ 22 ఏ జాబితాలో పెట్టారు. ఇప్పుడు తాపీగా అందులో 9.25 లక్షల ఎకరాలను సక్రమమేనంటూ తేల్చి 22 ఏ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించడం గమనార్హం. 

ఈనాం భూములపైనా అదే తీరు 
వైఎస్‌ జగన్‌ హయాంలో 22 ఏ జాబితా నుంచి తొలగించిన సర్వీస్‌ ఈనాం భూములనే ఇప్పుడు మళ్లీ 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 2022లో 1.59 లక్షల ఎకరాల విలేజ్‌ సర్వీస్‌ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వాటిపై ఆంక్షలు పెట్టి ఇప్పుడు తాను కొత్తగా 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. వీటితోపాటు సర్వీస్‌ ఈనాం లోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కొత్తగా చట్టం తేవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.  

» 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని అధికారులను సమీక్షలో చంద్రబాబు ఆదేశించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదార్‌ పాసు పుస్తకాల పంపిణీ చేయాలని సూచించారు. నిజానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక గ్రామంలో కూడా రీ సర్వే పూర్తి కాకపోవడం గమనార్హం. 

ఇక 2016కు మందు ఏదైనా ప్రభుత్వ హౌసింగ్‌ పథకం కింద పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. తద్వారా 2016 ముందు పట్టా ఉన్న యజమాని నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు, విక్రయించేందుకు, గిఫ్ట్‌ డీడ్‌గా ఇచ్చేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీసీఎల్‌ఏ జయలక్షి్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement