తూచ్‌.. అది పైలట్‌ ప్రాజెక్టే | Educators are angry over the negligence of the education department | Sakshi
Sakshi News home page

తూచ్‌.. అది పైలట్‌ ప్రాజెక్టే

Apr 9 2026 5:40 AM | Updated on Apr 9 2026 5:40 AM

Educators are angry over the negligence of the education department

ట్యాబ్‌ల్లో ‘టెన్త్‌’ మార్కుల నమోదుపై వెనక్కి తగ్గిన విద్యాశాఖ 

ఓపెన్‌ స్కూల్‌ మార్కుల నమోదుకు ట్యాబ్స్‌ రద్దు 

ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం 

విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడుతున్న విద్యావేత్తలు 

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాబ్‌ల్లో మార్కుల నమోదుపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది. సెంటర్లలోనే మార్కుల డిజిటలైజేషన్‌ పైలట్‌ ప్రాజెక్టు అంటూ మంగళవారం ప్రకటించింది. అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లకు దీనిపై ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే ఈ ఏడాది ఆన్‌లైన్‌ మార్కుల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.50 లక్షలు వెచ్చించి మూల్యాంకన కేంద్రాల్లో ఇంటర్నెట్‌ సైతం ఏర్పాటు చేశారు. 

ట్యాబ్‌ల్లో మార్కులు ఆన్‌లైన్‌ చేసేందుకు ప్రయత్నించగా.. ఒక్క ట్యాబ్‌ కూడా పనిచేయకపోవడంతో మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను తిరిగి స్ట్రాంగ్‌ రూముల్లోకి తరలించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ ఆందోళన వ్యక్తమవడంతో వెనక్కి తగ్గిన పాఠశాల విద్యాశాఖ ఇప్పు డు ఇది పైలట్‌ ప్రాజెక్టు అంటూ ప్రకటించింది. అలాగే, ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి పేపర్ల మూల్యాంకనాన్ని ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించడంతో పాటు ఈ మార్కులను కూడా పాత విధానంలోనే నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.  

తప్పులు సరిదిద్దుకునేందుకు పాట్లు 
పాఠశాల విద్యాశాఖ ఈనెల 6వ తేదీ నుంచి 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించింది. ఇందులో మార్కులను ‘ట్యాబ్లెట్‌ ఆధారిత డిజిటల్‌ మార్క్స్‌ ఎంట్రీ సిస్టమ్‌’ (టీడీఈఎస్‌)ను ప్రవేశపెట్టింది. వీటి వినియోగంపై శిక్షణ ఇవ్వకపోవడం, ట్యాబ్‌లు పనిచేయకపోవడం, సరైన ఇంటర్నెట్‌ లేకపోవడం వంటి కారణాలతో అనేక సమస్యలు తలెత్తి మార్కుల నమోదు ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారింది. 

ఈ అంశంపై మంగళవారం ‘టెన్త్‌ స్పాట్‌.. ఫెయిల్‌’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర విద్యాశాఖ రెగ్యులర్‌ ఎస్‌ఎస్‌సీ మూల్యాంకనంలో ట్యాబ్లెట్‌ మార్కుల నమోదు విధానాన్ని కొనసాగిస్తూనే.. ఇది పైలట్‌ ప్రాజెక్టు మాత్రమేనని ప్రకటించింది. అలాగే, ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి స్పాట్‌ వ్యాల్యుయేషన్‌లో కూడా ట్యాబ్‌తో మార్కులు ఎంట్రీ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 

ఈనెల 11 నుంచి 15 వరకు జరిగే ఓపెన్‌ స్కూల్‌ స్పాట్‌ కేంద్రాల్లో పాత పద్ధతిలోనే మూల్యాంకనం చేయనున్నారు. ఈ మేరకు జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, పైలట్‌ అంటే ఒకటి రెండు సబ్జెక్టులకు అమలు చేయాలి లేదా ఒక జిల్లాలో అమలు చేసి ఫలితాలను బట్టి వచ్చే ఏడాది ఈ విధానం కొనసాగించాలి. కానీ రెగ్యులర్‌ టెన్త్‌ మార్కులు పూర్తిస్థాయిలో ట్యాబ్స్‌లో ఆన్‌లైన్‌ చేయిస్తూనే పైలట్‌ ప్రాజెక్టు అనడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఇందులో జరిగే తప్పులకు ఎవరిని బలిచేస్తారోనని సెంటర్లలోని  చీఫ్‌ ఎగ్జామినర్స్, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 6.20 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement