ఇష్టానుసారంగా పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం
తలకిందులైన విద్యార్థుల మార్కులు
నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన విద్యార్థికి ఇంగ్లిష్ రీవాల్యుయేషన్‌లో పెరిగిన 11 మార్కులు..
ఇంకో రెండు జవాబులు మూల్యాంకనం చేయని వైనం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ విద్యార్థికి ఫిజిక్స్‌లో 5 మార్కులు కోత
రీ వెరిఫికేషన్‌లో గుర్తింపు
ఇలా బయటకు రాని బాధితులు ఎందరో !
బేతంచెర్ల: ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్లక్ష్యం మరో సారి వెలుగులోకి వచ్చింది. ఇష్టానుసారంగా జవాబు పత్రాలు మూల్యాంకనం చేయడంతో విద్యార్థుల మార్కులు తలకిందులయ్యాయి. కనీసం రాసిన జవాబులు కూడా మూల్యాంకనం చేయకపోవడం వాల్యూయేషన్ జరిగిన తీరుకు అద్దంపడుతోంది. మరి కొందరికి వచ్చిన మార్కులు కూడా కలపలేదు. తమకు మార్కులు తక్కువ వచ్చాయని రీవాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌కు పలువురు విద్యార్థులు వెళ్లడంతో బోర్డు వైఫల్యం బహిర్గతమైంది. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంకెంత మంది బాధితులు ఉన్నారో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాధానాలు రాసినా.. వదిలేశారు..
నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణానికి చెందిన కె.వసుప్రజ్వల (హాల్ టికెట్ నెం.2622123572)కు పదోతరగతి ఫలితాల్లో సోషల్‌లో 100, గణితం 100, సైన్స్‌లో 92, తెలుగు 92, హిందీలో 94 మార్కులు రాగా.. ఇంగ్లి‹Ùలో 65 మార్కులే రావడంతో అనుమానం వచ్చింది. దీంతో రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేయగా ఏకంగా 11 మార్కులు పెరిగి 76 మార్కులు నమోదయ్యాయి. అనంతరం ఆన్సర్ షీట్‌ను పరిశీలించగా 36, 37 ప్రశ్నలకు సమాధానాలు రాసినా దిద్దకుండా వదిలేసినట్లు గుర్తించారు. రీవాల్యుయేషనలో 11 మార్కులు పెరగడం ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మిగిలిన రెండు ప్రశ్నలకు కూడా మార్కులు కేటాయిస్తే తమ కుమార్తెకు మరిన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
12 మార్కులకు గానూ.. 7
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి పెదపూడి సంజయ్ స్వరూప్‌నకు 558 మార్కులు వచ్చాయి. ఫిజిక్స్ పేపర్ రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయగా పేపర్ పీడీఎఫ్ ఫైల్ పంపించారు. అందులో 13వ ప్రశ్నకు 4, 17వ ప్రశ్నకు 8 కలిపి మొత్తం 12 మార్కులు వచ్చాయి. కానీ, టోటల్‌లో 7 మార్కులు మాత్రమే వేశారు. ఈ విద్యార్థికి 5 మార్కులు కలపాల్సి ఉంది. దీని కోసం విద్యార్థి సంజయ్ స్వరూప్ ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు.


