కుటుంబంలో కలహాలు పొడచూపినా.. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు తలెత్తినా.. బలహీనులపై బలవంతుల దౌర్జన్యాలు పేట్రేగినా బాధితులకు కనిపించే ఏకైక ధైర్యం.. పోలీసులు. అలాంటిది పల్నాడు జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. అధికారం అండగా చెలగేరిపోతున్నారు. బాధితులకు అందాల్సిన న్యాయాన్ని పోలీసు స్టేషను మెట్ల వద్దే సమాధి చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో తొక్కేయాల్సిన వారు అరాచకాలకు పాల్పడేవారికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ఓ సీఐ రాసలీలల బాగోతం, మరో సీఐ లంచావతారం, ఇంకో సీఐ అధికార పార్టీ దాసోహం... ఇలా జిల్లా పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా మారాయి.
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ రోజురోజుకూ మసకబారుతోంది. ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వాల్సిన పోలీసు అధికారులు వరుస ఆరోపణలతో బజారున పడుతున్నారు. దీంతో ఆ వ్యవస్థపై విశ్వసనీయత దెబ్బతింటోంది. ఇటీవల కాలంలో జిల్లాలో వెలుగుచూసిన అనేక సంఘటనలు పోలీసు వ్యవస్థలో లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో పల్నాడులో పోలీసు వ్యవస్థ దారితప్పుతోంది. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి పోలీసుస్టేషన్‌లో పనిచేసిన సీఐ భాస్కర్ ఓ మహిళతో సహజీవనం చేశాడన్న ఆరోపణలపై వారం క్రితం వీఆర్‌కు పంపినట్టు తెలుస్తోంది. గతంలో మహిళతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈ సీఐ వ్యవహారాన్ని ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధికి అందించాడు. త్వరలో మీడియా ముందు బహిర్గతం చేస్తానని చెప్పాడు.
అదే జరిగితే పోలీసు శాఖకు మాయని మచ్చగా మిగులుతుందని భావించిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. వాస్తవానికి సీఐపై వచ్చిన ఆరోపణ తీవ్రత దృష్ట్యా సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేయాల్సి ఉంది. అతనికున్న రాజకీయ పలుకుబడి కారణంగా నామమాత్రపు చర్యలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇది ఇలా ఉండగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై పోలీసులు ప్రతి చర్యకు దిగినట్టు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళతో ఫిర్యాదు చేయించి అతన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతన్ని బెదిరించి ఎలాగైనా తనకున్న పలుకుబడితో మళ్లీ దాచేపల్లికి సీఐగా రావాలని భాస్కర్ ప్రయతి్నస్తున్నారని సమాచారం.
పరువు హత్యకు సహకరించిన సీఐపై వేటు...
మాచర్లకు చెందిన చౌడేశ్వరి నెల కిందట నాగరాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారంలో తలదూర్చిన మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణ.. యువతి తండ్రి చంద్రశ్రీనుతో బేరం కుదుర్చుకొని యువతిని బలవంతంగా తండ్రికి అప్పగించాడు. దీంతో కుమార్తెను గత నెల 18వ తేదీన తండ్రి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. విషయం బయటకు రావడంతో సదరు సీఐ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. వైద్యురాలు సహకరించకపోవడంతో వ్యవహారం బెడిసికొట్టింది. మీడియాలో కథనాలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో సీఐ అవినీతి బాగోతం వెలుగుచూసింది. సుమారు రూ.6.5 లక్షలు చేతులు మారినట్టు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా ఆదివారం సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు.
సివిల్ పంచాయితీలకు ఆ స్టేషన్ అడ్డా...
పిడుగురాళ్ల పోలీసు స్టేషన్ సివిల్ పంచాయితీలకు అడ్డాగా మారింది. అక్కడ ప్రజాప్రతినిధి అండతో ద్వితీయ శ్రేణి నాయకులు నిత్యం ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ఆర్యవైశ్య వ్యాపారులను అనేక మందిని బలవంతంగా స్టేషన్లో ఉంచి వారిచే ఆస్తులను రాయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాల కంట పడకుండా వెనుక ఉన్న క్వార్టర్ట్స్‌లో ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారట. గత ఏడాది డిసెంబర్‌లో ఓ ఆర్యవైశ్య మహిళ పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌లో పోలీసుల వేధింపులు తాళలేక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా ఆ సీఐపై చర్యలు తీసుకోకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు.
బుకీలను తప్పించిన పోలీసులు...
క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనపై పల్నాడు జిల్లా ఎస్పీ దృష్టి సారించి బుకీల ఏరివేతకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించారు. విషయం తెలుసుకున్న జిల్లాలోని కొంతమంది అవినీతి అధికారులు ఆ సమాచారాన్ని బుకీలకు ముందుగానే చేరవేశారు. దీంతో బుకీలంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. వారి ఆచూకీ కోసం ఎస్బీ పోలీసులు గాలిస్తున్నా ప్రయోజనం దక్కడం లేదు. అందరి సెల్‌ఫోన్ సిగ్నల్‌లు ఇతర రాష్ట్రాలలో ఉన్నట్టు కనిపిస్తుండటంతో వారిని పట్టుకోవడం సవాలుగా మారింది. ఐపీఎల్, వర్డల్ కప్, ఇతర ముఖ్యమైన మ్యాచ్‌లు జరిగే సమయంలో బుకీల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయా స్టేషన్లలో పనిచేసే కొంతమంది అధికారులు, సిబ్బంది మామూళ్లు తీసుకుంటున్నారు. బుకీలు చిక్కితే వీళ్ల అవినీతి బాగోతం బయటపడుతుందని ముందస్తు సమాచారం ఇచ్చి పరారీకి సహకరించినట్టు సమాచారం. నేరుగా బుకీలతో సంబంధం పెట్టుకొని బెట్టింగ్ ఆడిస్తున్న ఓ సీఐపై వ్యవహారంపై జిల్లా ఎస్పీ దృష్టి సారించినట్టు తెలియవచ్చింది.
పేకాటకు సహకరిస్తున్న సీఐలు...
ఇప్పటికే చిలకలూరిపేట పట్టణం పేకాటకు అడ్డాగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి చిలకలూరిపేటకు పెద్ద సంఖ్యలో జూదగాళ్లు తరలి వస్తున్నారు. నిత్యం రూ.కోట్లు చేతులు మారుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని తిమ్మాపురం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ పేకాట శిబిరాలపై సీఐ దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వా«దీనం చేసుకొని పేకాట రాయుళ్లను స్టేషన్‌కు తరలించాడు. ఇక్కడి రెండు వర్గాల్లో ఓ వర్గానికి మద్దతుగా రెండో వర్గం వారిపై ఇలా దాడులు జరిగాయి. కానీ ఈ వ్యవహారంలో చినబాబు వద్ద పనిచేసే వ్యక్తి కలుగుజేసుకొని సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీఆర్‌కు పిలవాలని ఉన్నతా«ధికారులపై ఒత్తిడి చేశాడు. దీంతో సీఐ వెనక్కితగ్గి ఆ పేకాట రాయుళ్లను కేసు లేకుండా విడిచిపెట్టాడు. అధికార పార్టీకి వత్తాసుగా వ్యవహరించొద్దన్నారు. మిగతా చోట్ల పోలీసు సీఐ తనవంతు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


