
వివాహ సమయానికి అదృశ్యం
పోలీసులకు వధువు బంధువుల ఫిర్యాదు
తూర్పు గోదావరి: ఓ మహిళతో కాపురం చేస్తూనే.. పెళ్లి పేరుతో మరో యువతిని మోసం చేసేందుకు యత్నించి, తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. సీఐ బీఎన్ పట్నాయక్ వివరాల మేరకు, గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతికి, దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి వీరవెంకట సత్యనారాయణతో ఇటీవల వివాహం కుదిరింది. సోమవారం తెల్లవారుజామున స్థానిక ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం వధువు ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు చేశారు.
మరో గంటలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు కనిపించడంలేదంటూ వధువు బంధువులకు రాత్రి ఏడు గంటల సమయంలో సమాచారం వచ్చింది. దీంతో కంగారు పడిన ఆమె బంధువులు అసలు వివరాలు సేకరించారు. అంతకు ముందే సత్యనారాయణకు పెళ్లయి, కాపురం చేస్తున్నాడని, అందుకే పెళ్లికి రాకుండా అదృశ్యమైనట్టు సమా చారం అందింది. దీంతో వధువు కుటుంబానికి న్యా యం చేయాలంటూ ఆమె బంధువులు ఆందోళన చేశా రు. సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ పట్నాయక్ తెలిపారు.