‘స్థానిక’ సమరానికి సన్నద్ధం | SEC video conference with collectors on local election preparations | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ సమరానికి సన్నద్ధం

Aug 20 2026 5:45 AM | Updated on Aug 20 2026 5:45 AM

SEC video conference with collectors on local election preparations

సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి  

అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే పోలింగ్‌ కేంద్రాల ఎంపిక  

స్థానిక ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ 

బ్యాలెట్‌ బాక్స్‌లు, పోలింగ్‌ సిబ్బంది వివరాలపై ఆరా 

సాక్షి, అమరావతి: రాజకీయంగా సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టిపెట్టి అన్ని అంశాలనూ పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నాకే పోలింగ్‌ కేంద్రాలు ఎంపిక చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. నిబంధనల ప్రకారం పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని వసతులూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై  బుధవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి కలెకర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ సంపత్‌కుమార్, పంచాయతీరాజ్‌ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ సుధాకర్‌రావు కూడా పాల్గొన్నారు. 

ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకు సమావేశం కొనసాగింది. అన్ని జిల్లాల్లోని పరిస్థితులపై ఎస్‌ఈసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న బ్యాలెట్‌ బాక్స్‌ల వివరాలు, పోలింగ్‌ సిబ్బంది లెక్కలపై ఆరా తీశారు. తమ జిల్లాల్లో బ్యాలెట్‌ బాక్సుల కొరత ఉందని కొందరు కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దష్టికి తీసుకెళ్లారు. దీంతో అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు సమకూర్చేందుకు చర్యలు చేపడతామని ఎస్‌ఈసీ వెల్లడించారు.   

ఎన్నికల తేదీల ప్రకటనకు ఇంకా సమయం ఉంది : పునేఠ 
కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్రపునేఠ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది చెప్పడానికి ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.   

30 వేల బ్యాలెట్‌ బాక్స్‌ల కొనుగోలుకు ఆదేశాలు 
ఇదిలా ఉండగా.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన కొత్త బ్యాలెట్‌ బాక్స్‌ల కొనుగోలుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పునేఠ పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖను ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 15 వేలు కొత్త బ్యాలెట్‌ బాక్స్‌లు, మున్సిపల్‌ శాఖ ఆ«ధ్వర్యంలో మరో 15 వేలు.. మొత్తం 30 వేల బ్యాలెట్‌ బాక్స్‌ల కొనుగోలుకు ఆదేశించారని, ఆ మేరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు వివరించారు.  

అక్టోబర్‌ చివరికల్లా స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తాం
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
రిజర్వేషన్లు 50 శాతం దాటితే వివాదం తిరిగి న్యాయస్థానానికి చేరుతుందన్న పిటిషనర్‌
దీనివల్ల ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతుందని వెల్లడి
దీనిపై ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వాలని ఏజీకి ధర్మాసనం సూచన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు అక్టోబర్‌ చివరినాటికి ఎన్నికలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. బీసీ జన గణనతో పాటు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు, స్థానిక సంస్థలకు సత్వరమే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది తాండవ యోగేష్‌  వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యా (పిల్‌)లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. రిజర్వేషన్లు 50 శాతం దాటితే న్యాయపరమైన సమస్యలు తలెత్తి, ఎన్నికల నిర్వహణలో అసాధారణ జాప్యం జరుగుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు విషయంలో ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)కి ధర్మాసనం సూచించింది. 

అంతకు ముందు ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థలకు సంబంధించిన చట్టాలకు సవరణలు చేస్తున్నామని, వాటిని శాసనసభ ఆమోదానికి పంపనున్నామని చెప్పారు. ఆ తరువాత బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవోలు ఇస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు సమయం కావాలని కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను బహిర్గతం చేసేలా ఆదేశాలివ్వండి..
కేశన శంకరరావు తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందన్నారు. ఆ నివేదికను బహిర్గతం చేస్తే వేటి ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు, బీసీలకు న్యాయం జరిగిందా లేదా అన్నది రూఢీ అవుతుందని చెప్పారు. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను ప్రభుత్వం ఆమోదించిన తరువాత దాన్ని బహిర్గతం చేస్తామని ఏజీ చెప్పారు.

రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదు..
మరో పిటిషనర్‌ తాండవ యోగేష్‌ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో ఉందని, ఒకవేళ రిజర్వేషన్లు 50 శాతం మించితే వివాదం తిరిగి న్యాయస్థానానికి చేరుతుందన్నారు. దీని వల్ల ఎన్నికల నిర్వహణలో అంతులేని జాప్యం జరుగుతుందని వివరించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వాలని ఏజీకి సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement