కౌంటింగ్‌ వీడియో తీయండి

SEC directive to collectors on problematic panchayats - Sakshi

సమస్యాత్మక పంచాయతీలపై కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఆదేశం

సింగిల్‌ డిజిట్‌లో ఓట్ల తేడా ఉంటేనే రీ కౌంటింగ్‌కు అనుమతి 

సాక్షి, అమరావతి: సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వెబ్‌కాస్టింగ్‌ లేదా సీసీ కెమెరా లేదా వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు కలెక్టర్లతో పాటు డీపీవోలు, ఎస్పీలకు లేఖలు రాశారు. మొత్తం నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే రెండు దశలు పూర్తవగా.. మూడు, నాలుగో దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

► కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో కరెంటు సరఫరాకు అంతరాయం కలుగకుండా విద్యుత్‌ శాఖ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలి. అదే సమయంలో జనరేటర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. 
► కౌంటింగ్‌ అనంతరం పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల మధ్య అతి స్వల్పంగా ఒక అంకె (సింగిల్‌ డిజిట్‌) ఓట్ల తేడా ఉన్నప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం ఒక్కసారి రీ కౌంటింగ్‌కు అనుమతించాలి. రెండు అంకెల (డబుల్‌ డిజిట్‌) ఓట్ల తేడా ఉంటే అనుమతించవద్దు. 
► కౌంటింగ్‌ కేంద్రాలలోకి ముందుగా అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ఇతరులను రానీయకూడదు. 
► సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, పెద్ద గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్‌ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top